
స్వదేశంలో ఈనెల 29 నుంచి జరిగే ఆసియాకప్ పురుషుల హాకీ టోర్నమెంట్‌లో పాల్గొనే భారత జట్టును బుధవారం ప్రకటించారు. 18 మంది సభ్యులతో కూడిన భారత జట్టుకు ‘డ్రాగ్ ఫ్లికర్’ హర్మన్‌ప్రీత్ సింగ్ నాయ కత్వం వహిస్తాడు.
సెప్టెంబరు 7వ తేదీ వరకు జరిగే ఈ టోర్నీలో ఎనిమిది దేశాలు పోటీపడతాయి. విజేతగా నిలిచిన జట్టు వచ్చే ఏడాది బెల్జియం–నెదర్లాండ్స్‌లలో జరిగే ప్రపంచకప్ టోర్నీకి నేరుగా అర్హత సాధిస్తుంది.
టైటిల్ పోరు బాట ఇలా
చైనాతో ఈనెల 29న జరిగే గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌తో భారత్ తమ టైటిల్ వేటను మొదలుపెడుతుంది. అనంతరం ఆగస్టు 31న జపాన్‌తో, సెప్టెంబరు 1న కజకిస్తాన్‌తో భారత్ ఆడుతుంది. గ్రూప్ ‘బి’లో డిఫెండింగ్ చాంపియన్ దక్షిణ కొరియా, మలేసియా, చైనీస్ తైపీ, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి.
లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశాక రెండు గ్రూప్‌లలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన నాలుగు జట్లు ‘సూపర్–4’ దశకు చేరుకోనున్నాయి. ‘సూపర్–4’లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెప్టెంబరు 7న టైటిల్ కోసం తలపడతాయి. ఇదిలా ఉంటే.. భారత్‌లో జరిగే ఈ ఆసియాకప్ టోర్నీ నుంచి పాకిస్తాన్ వైదొలిగింది. ఆ జట్టు స్థానంలో బంగ్లాదేశ్ గ్రూప్-‘బి’లో చేరింది.
భారత పురుషుల హాకీ జట్టు: కృషన్ పాఠక్, సూరజ్ కర్కేరా (గోల్ కీపర్లు), సుమిత్, జర్మన్‌ప్రీత్ సింగ్, సంజయ్, హర్మన్‌ప్రీత్ సింగ్, జుగ్‌రాజ్ సింగ్, అమిత్ రోహిదాస్ (డిఫెండర్లు), రాజిందర్ సింగ్, రాజ్‌కుమార్ పాల్, హార్దిక్ సింగ్, మన్‌ప్రీత్ సింగ్, వివేక్ సాగర్ ప్రసాద్ (మిడ్‌ఫీల్డర్లు), మన్‌దీప్ సింగ్, శిలానంద్ లాక్రా, అభిషేక్, సుఖ్‌జీత్ సింగ్, దిల్‌ప్రీత్ సింగ్ (ఫార్వర్డ్స్).