
మెగా టోర్నీకి సరైన సన్నాహాలు
భారత హాకీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ వ్యాఖ్య
నాలుగు మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియా బయలుదేరిన టీమిండియా
బెంగళూరు: ఆసియా కప్ టోర్నమెంట్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా వంటి మేటి జట్టుతో తలపడితే లోపాలు సవరించుకొని మరింత మెరుగయ్యే అవకాశం ఉంటుందని భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ అభిప్రాయపడ్డాడు. ఈ నెల 29 నుంచి రాజ్‌గిర్ వేదికగా పురుషుల ఆసియా కప్ హాకీ టోర్నమెంట్ ప్రారంభం కానుండగా... అంతకుముందు భారత జట్టు ఆ్రస్టేలియాలో పర్యటిస్తోంది. ఈ టూర్‌లో భాగంగా పెర్త్‌లోని హాకీ స్టేడియంలో ఆతిథ్య ఆ్రస్టేలియాతో హర్మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలోని టీమిండియా నాలుగు మ్యాచ్‌లు ఆడనుంది.
దీని కోసం శుక్రవారం బెంగళూరు నుంచి జట్టు ఆ్రస్టేలియాకు పయనమైంది. ఈ సందర్భంగా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ... ‘ఆ్రస్టేలియా వంటి బలమైన ప్రత్యర్థితో వారి సొంతగడ్డపై మ్యాచ్‌లు ఆడటం సవాలుతో కూడుకున్నది. ఆసియా కప్ ప్రారంభానికి ముందు ఇలాంటి క్లిష్టమైన సిరీస్ ఆడనుండటం జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మేమంతా ఇలాంటి సన్నద్ధతే కోరుకున్నాం. ఆసియా కప్ కోసం జట్టును సిద్ధం చేసుకునేందుకు ఈ సిరీస్ ఉపయోగపడనుంది.
బలమైన ప్రత్యర్థితో తలపడినప్పుడే మన లోపాలు బయటపడతాయి. వాటిని ఎలా అధిగమించాలో మార్గాలు వెతికి మరింత మెరుగైన ప్రదర్శన చేయవచ్చు. జట్టు మొత్తం సమష్టిగా రాణించాలని భావిస్తున్నాం. ఈ సన్నద్ధత ఆసియా కప్‌లో తప్పక ఉపయోగపడుతుంది’ అని అన్నాడు. ఆగస్టు 15, 16, 19, 21న పెర్త్‌లో భారత్, ఆ్రస్టేలియా మధ్య హాకీ మ్యాచ్‌లు జరగనున్నాయి.
ప్రదర్శన ఆధారంగా ఆసియాకప్ తుది జట్టు కూర్పు ఉండనుంది. మెరుగైన ఆటతీరు కనబర్చిన ప్లేయర్లనే ఆసియాకప్‌నకు ఎంపిక చేయనున్నారు. ప్రస్తుత జట్టులో అటు అనుభవజ్ఞు, ఇటు యువకులు ఉండటంతో... ఆ్రస్టేలియాపై వారి ఆటతీరును అంచనా వేసిన తర్వాతే ఆసియాకప్‌నకు జట్టును ఎంపిక చేయనున్నారు. ఈ టోర్నీలో సత్తా చాటిన జట్టు వరల్డ్‌కప్‌నకు నేరుగా అర్హత సాధించనుంది.