
ఆసియా కప్ హాకీ టోర్నీలో భారత్ శుభారంభం ∙
తొలి మ్యాచ్‌లో చైనాపై 4–3 గోల్స్‌తో విజయం
రాజ్‌గిర్ (బిహార్): అంచనాలకు తగ్గట్టు ఆడకపోయినా... ఆసియా కప్ పురుషుల హాకీ టోర్నమెంట్‌లో భారత జట్టుకు శుభారంభం లభించింది. శుక్రవారం మొదలైన ఈ టోర్నీలో భాగంగా జరిగిన పూల్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 4–3 గోల్స్ తేడాతో చైనా జట్టును ఓడించింది. భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (20వ, 33వ, 47వ నిమిషాల్లో) ‘హ్యాట్రిక్’ నమోదు చేసి జట్టు విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు. మరో గోల్‌ను జుగ్‌రాజ్ సింగ్ (18వ నిమిషంలో) అందించాడు.
చైనా తరఫున షిహావో డు (12వ నిమిషంలో), బెన్‌హాయ్ చెన్ (35వ నిమిషంలో), జీషెంగ్ గావో (41వ నిమిషంలో) ఒక్కోగోల్ చేశారు. ఈ మ్యాచ్‌లో నమోదైన మొత్తం ఏడు గోల్స్ పెనాల్టీ కార్నర్‌ల ద్వారానే రావడం విశేషం. హర్మన్‌ప్రీత్ సింగ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. హర్మన్‌ప్రీత్‌కు 200 డాలర్ల చెక్‌ను హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ అందజేశారు. తమకంటే తక్కువ ర్యాంక్ ఉన్న చైనాపై భారత్ భారీ విజయం సాధిస్తుందని ఆశించినా... ప్రత్యర్థి జట్టు నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురైంది.
భారత జట్టు తమకు లభించిన 11 పెనాల్టీ కార్నర్‌లో కేవలం నాలుగింటిని మాత్రమే సద్వినియోగం చేసుకుంది. చైనా జట్టుకు ఆరు పెనాల్టీ కార్నర్‌లు రాగా, మూడింటిని లక్ష్యానికి చేర్చింది. తొలి రోజు జరిగిన ఇతర లీగ్ మ్యాచ్‌ల్లో మలేసియా 4–1తో బంగ్లాదేశ్ జట్టుపై... డిఫెండింగ్ చాంపియన్ దక్షిణ కొరియా 7–0తో చైనీస్ తైపీపై... జపాన్ 7–0తో కజకిస్తాన్‌పై విజయం సాధించాయి. నేడు జరిగే మ్యాచ్‌ల్లో చైనీస్ తైపీతో బంగ్లాదేశ్; మలేసియాతో దక్షిణ కొరియా తలపడతాయి. భారత జట్టు తమ తదుపరి మ్యాచ్‌ను ఆదివారం జపాన్ జట్టుతో ఆడుతుంది.