
రాజ్‌గిర్ (బిహార్): ఈ నెలాఖరులో భారత్ ఆతిథ్యమిచ్చే ఆసియా కప్ పురుషుల హాకీ టోర్నీకి సంబంధించి కనువిందు చేసే ‘మస్కట్’ను ఆదివారం ఆవిష్కరించారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అధికారిక మస్కట్‌గా ‘చాంద్’ (చందమామ)ను ఆవిష్కరించారు. భారత దివంగత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ ప్రాక్టీస్ స్ఫూర్తితో పాటు బిహార్‌లోని ప్రఖ్యాత వాల్మీకి టైగర్ రిజర్వ్‌లోని పులుల శౌర్యానికి ప్రతీకగా ‘చాంద్’ను ఆవిష్కరించినట్లు హాకీ ఇండియా (హెచ్‌ఐ) తెలిపింది.
ఫ్లడ్‌లైట్లు కాదు కదా... కనీసం పూర్తిస్థాయి వీధి దీపాలు లేని ఆ రోజుల్లో చందమామ పంచిన వెన్నెల వెలుగుల్లోనే ధ్యాన్‌చంద్ తన ప్రాక్టీస్‌ను పూర్తి చేసేవారు. ఆ స్ఫూర్తిని ప్రతిబింబించేలా ఆయన పుట్టిన రోజున (ఆగస్టు 29) మొదలయ్యే ఆసియా కప్ టోర్నీకి ‘చాంద్’ మస్కట్‌ను ఖరారు చేశారు. సెపె్టంబర్ 7 వరకు రాజ్‌గిర్‌లోని స్టేడియంలో ఈ టోర్నీ జరుగుతుంది. ఆసియా దేశాలు పాల్గొనే ఈ టోర్నీలో మొదట్లో ఆసక్తి కనబరిచిన దాయాది పాకిస్తాన్ జట్టు చివరకు వైదొలగింది.
పాకిస్తాన్ స్థానంలో బంగ్లాదేశ్ బరిలోకి దిగనుంది. ఆసియా కప్ టోర్నీ విజేత వచ్చే ఏడాది ఆగస్టులో బెల్జియం–నెదర్లాండ్స్‌లో జరిగే ప్రపంచకప్ టోర్నీకి నేరుగా అర్హత సాధిస్తుంది. 16 జట్లు పోటీపడే ప్రపంచకప్ టోర్నీకి ఇప్పటికే ఆస్ట్రేలియా, స్పెయిన్, అర్జెంటీనా, జర్మనీ, న్యూజిలాండ్ జట్లు అర్హత సాధించాయి.