
మలేసియాపై ‘సూపర్–4’ మ్యాచ్‌లో టీమిండియా ఘనవిజయం
చైనాతో చివరి మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకున్నా ఫైనల్‌కు అర్హత
రాజ్‌గిర్ (బిహార్): సొంతగడ్డపై జరుగుతున్న ఆసియా కప్ పురుషుల హాకీ టోర్నమెంట్‌లో ఆతిథ్య భారత జట్టు ఫైనల్ చేరే అవకాశాలను సజీవంగా నిలబెట్టుకుంది. మలేసియా జట్టుతో గురువారం జరిగిన ‘సూపర్–4’ దశ రెండో మ్యాచ్‌లో భారత్ 4–1 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున మన్‌ప్రీత్ సింగ్ (17వ నిమిషంలో), సుఖ్‌జీత్ సింగ్ (19వ నిమిషంలో), శిలానంద్ లాక్రా (24వ నిమిషంలో), వివేక్ సాగర్ ప్రసాద్ (38వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు.
మలేసియా జట్టుకు షఫీక్ హసన్ (2వ నిమిషంలో) ఏకైక గోల్ అందించాడు. ఈ మ్యాచ్‌లో నెగ్గడం ద్వారా ‘సూపర్–4’ పట్టికలో భారత్ నాలుగు పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది. బుధవారం డిఫెండింగ్ చాంపియన్ దక్షిణ కొరియాతో జరిగిన ‘సూపర్–4’ తొలి మ్యాచ్‌ను భారత్ 2–2తో ‘డ్రా’ చేసుకుంది. శుక్రవారం విశ్రాంతి దినం తర్వాత... శనివారం చైనాతో జరిగే చివరి ‘సూపర్–4’ మ్యాచ్‌ను భారత్ ‘డ్రా’ చేసుకున్నా పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది.
గురువారం జరిగిన ‘సూపర్–4’ మరో మ్యాచ్‌లో చైనా 3–0 గోల్స్ తేడాతో డిఫెండింగ్ చాంపియన్ దక్షిణ కొరియాను ఓడించింది. ప్రస్తుతం చైనా, మలేసియా మూడు పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో... కొరియా ఒక పాయింట్‌తో నాలుగో స్థానంలో ఉంది.
మలేసియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. మ్యాచ్ మొదలైన రెండు నిమిషాలకే మలేసియా హసన్ గోల్‌తో ఖాతా తెరిచింది. అయితే భారత్ వెంటనే తేరుకుంది. సమన్వయంతో ఆడుతూ మలేసియా గోల్‌పోస్ట్‌పై ఎడతెరిపి లేకుండా దాడులు నిర్వహించింది. రెండో క్వార్టర్‌లో భారత్ దాడులకు ఫలితం లభించింది. ఏడు నిమిషాల వ్యవధిలో భారత్ మూడు గోల్స్ చేసి ఆధిక్యంలోకి వెళ్లింది.
ఆ తర్వాత అదే జోరు కొనసాగించిన టీమిండియా ప్రత్యర్థి జట్టుకు మరో గోల్ చేసే అవకాశం ఇవ్వకుండా విజయాన్ని ఖాయం చేసుకుంది. మ్యాచ్ మొత్తంలో భారత్‌కు ఆరు పెనాల్టీ కార్నర్‌లు లభించగా... ఒక పెనాల్టీ కార్నర్‌ను భారత్ గోల్‌గా మలిచింది. లేదంటే మరింత తేడాతో మలేసియాపై భారత్‌కు విజయం దక్కేది.