భారత హాకీ దిగ్గజం బల్బీర్‌ కన్నుమూత

Hockey Legend Balbir Singh Sr Deceased At Mohali Hospital - Sakshi

మొహాలీ : భారత హాకీ దిగ్గజం బల్బీర్‌ సింగ్‌ సీనియర్(95)‌ కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మొహాలీలోని ఫోర్టిస్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆస్పత్రి డైరెక్టర్‌ అభిజిత్‌ సింగ్‌ వెల్లడించారు. మే 8న హాస్పిటల్‌లో చేరిన ఆయనకు వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. గతంలో కూడా ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆయన మూడు నెలలకుపైగా హాస్పిటల్‌లోనే ఉన్నారు. 

1948, 1952, 1956 ఒలింపిక్స్‌లలో భారత హాకీ జట్టు మూడు బంగారు పతకాలు సాధించడంలో బల్బీర్‌ కీలక పాత్ర పోషించారు. 1975లో ప్రపంచ కప్‌ సాధించిన భారత హాకీ జట్టుకు ఆయన కోచ్‌గా, మేనేజర్‌గా వ్యవహించారు. ఒలింపిక్స్‌లో పురుషుల హాకీ ఫైనల్‌లో అత్యధిక గోల్స్‌ చేసిన ఆటగాడిగా ఆయన పేరిట ఉన్న రికార్డును ఇప్పటివరకు ఎవరు అధిగమించలేదు. 1952 ఒలింపిక్స్‌లో భారత్‌ 6-1తేడాతో నెదర్లాండ్స్‌పై విజయం సాధించగా.. అందులో 5 గోల్స్‌ బల్బీర్‌ చేసినవే. బల్బీర్‌ తన కెరీర్‌లో 61 అంతర్జాతీయ క్యాప్స్‌తో పాటుగా.. 246 గోల్స్‌ సాధించాడు. భారత హాకీకి బల్బీర్‌ చేసిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 1957లో ఆయనను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఆయన సేవలకు గుర్తుగా హాకీ ఇండియా.. 2015లో మేజర్‌ ధ్యాన్‌చంద్‌ లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డును ప్రదానం చేసింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top