అందుకే జుట్టు ఊడిపోయిందేమో: విహారి

Hanuma Vihari Says Looking Forward To Play In India Feels Great - Sakshi

కింగ్‌స్టన్‌(జమైకా): స్వదేశంలో టెస్టు మ్యాచ్‌ ఆడేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని తెలుగు క్రికెటర్‌, ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ హనుమ విహారి అన్నాడు. కెరీర్‌లో తొలి టెస్టు సెంచరీ సాధించడం చాలా గొప్పగా అనిపిస్తోందని హర్షం వ్యక్తం చేశాడు. వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో 257 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన టీమిండియా టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. భారత బౌలర్ల దాటికి తట్టుకోలేక 468 పరుగుల అసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విండీస్‌ జట్టు 210 పరుగులకే ఆలౌటైంది. ఈ క్రమంలో ఆతిథ్య జట్టును మట్టి కరిపించిన టీమిండియా ఐసీసీ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో 120 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. అదే విధంగా కరేబియన్‌ దీవుల్లో తొలిసారి టెస్ట్‌ సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన ఘనత సాధించింది. ఇక ఈ టెస్టులో సెంచరీ, అర్ధసెంచరీతో సత్తా చాటిన యువ క్రికెటర్‌ హనుమ విహారి ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ గా నిలిచాడు. 

ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం విహారి మాట్లాడుతూ...టీమిండియా కోచ్‌ రవిశాస్త్రి సలహాలు, సూచనల వల్లే తాను ఈ మ్యాచ్‌లో రాణించగలిగానని పేర్కొన్నాడు. అదే విధంగా అజింక్య రహానే తనకు అండగా నిలబడి పటిష్టమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పడంలో సహాయపడ్డాడని తెలిపాడు. ‘తొలి టెస్టు సెంచరీ సాధించడం చాలా గొప్పగా అనిపిస్తోంది. గత మ్యాచ్‌లో శతకం చేజార్చుకోవడంతో ఈసారి భారీ స్కోరు కోసం మరింత పట్టుదలగా నిలబడ్డాను. ఈ పిచ్‌పై ఓపిక అవసరం. బౌలర్లకు పిచ్‌ అనుకూలిస్తున్న సమయంలో చెత్త బంతి కోసం ఎదురు చూడాలి. రెండో ఇన్నింగ్స్‌లోనూ మా ప్రణాళిక బాగా పని చేసింది. నా బ్యాటింగ్‌ స్టాన్స్‌ మార్చుకునే విషయంలో కోచ్‌ రవిశాస్త్రి కొన్ని సూచనలు చేశారు. అవి బాగా పని చేశాయి. ఒత్తిడిలో ఆడటాన్ని నేను ఇష్టపడతాను. అదే మనలోని అసలు సత్తాను బయటపెడుతుందని నా నమ్మకం. తొమ్మిదేళ్ల క్రితమే నా ఫస్ట్‌ క్లాస్‌ కెరీర్‌ ప్రారంభమైంది కాబట్టి అప్పుడే 6 వేల పరుగులు దాటేశాను. స్వదేశంలో ఇంకా టెస్టు ఆడలేదు. దాని కోసం ఎదురు చూస్తున్నాను. మనోళ్ల మధ్య బ్యాటింగ్‌ చేయడం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది’ అని పేర్కొన్నాడు. అయితే 26 ఏళ్ల వయసులోనే జుట్టు ఇంతగా ఎందుకు ఊడిపోయిందో తనకు తెలీదని... బహుశా చిన్నప్పటి నుంచి బాగా ఎక్కువగా బ్యాటింగ్‌ చేయడం వల్లేనేమో అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు.

చదవండి : రెండో టెస్టులోనూ విండీస్‌ చిత్తు..సిరీస్‌ కైవసం

కాగా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన విహారిపై కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ప్రశంసల వర్షం కురిపించాడు. ‘పిచ్‌ పరిస్థితిని బట్టి చూస్తే ఈ టెస్టులో విహారి ఇన్నింగ్స్‌ అత్యుత్తమం. అతను ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. విహారి బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు డ్రెస్సింగ్‌ రూమ్‌లో మేమెంతో ప్రశాంతంగా కూర్చున్నాం. తప్పులు సరిదిద్దుకునేందుకు, ఆటను మెరుగుపర్చుకునేందుకు అతను ఎప్పుడూ వెనుకాడడు. తను ప్రాణం పెట్టి ఆడే రకం. జట్టు కోసం ఏం చేసేందుకైనా సిద్ధంగా ఉంటాడు. ఇంత స్వల్ప కెరీర్‌లోనే విహారికి జట్టు ఎందుకు మద్దతునిస్తోందో అతను చూపించాడు’ అని రోహిత్‌ శర్మను కాదని విహారిని జట్టులోకి తీసుకున్న తన నిర్ణయాన్ని మరోసారి సమర్థించుకున్నాడు.   

చదవండి : కెప్టెన్‌గా కోహ్లి సరికొత్త రికార్డు

చదవండి : మా ముందున్న లక్ష్యం అదే : కోహ్లి

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top