టీమిండియాపై తొలి టెస్టులోనే! | Hamza Maiden Fifty Against Team India | Sakshi
Sakshi News home page

టీమిండియాపై తొలి టెస్టులోనే!

Oct 21 2019 10:45 AM | Updated on Oct 21 2019 10:45 AM

Hamza Maiden Fifty Against Team India - Sakshi

రాంచీ:  డీన్‌ ఎల్గర్‌, డీకాక్‌, డుప్లెసిస్‌ వంటి స్టార్‌ ఆటగాళ్లు విఫలమైన చోట కొత్త  ఆటగాడు జుబేర్‌ హమ్జా తన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో హమ్జా హాఫ్‌ సెంచరీ సాధించాడు. 56 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సర్‌తో అర్థ శతకం నమోదు చేశాడు. 16  పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ సమయంలో హమ్జా హాఫ్‌ సెంచరీ సాధించడం సఫారీలకు ఊరటనిచ్చింది. కాగా, హమ్జాకు ఇది తొలి టెస్టు హాఫ్‌ సెంచరీ. అందులోనూ టీమిండియాపై హమ్జాకు ఇదే తొలి టెస్టు. ఈ ఏడాది ఆరంభంలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌ ద్వారా టెస్టుల్లో అరంగేట్రం చేసిన హమ్జాకు ఇది రెండో టెస్టు మ్యాచ్‌ మాత్రమే. ఆడుతున్న రెండో టెస్టులోనే హమ్జా అర్థ శతకం సాధించడం విశేషం.

ఈ రోజు ఆటలో భాగంగా అశ్విన్‌ వేసిన 18 ఓవర్‌ ఆఖరి బంతిని సిక్స్‌ కొట్టడంతో హమ్జా హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పెద్దగా అంతర్జాతీయ క్రికెట్‌ అనుభవం లేని 24 ఏళ్ల హమ్జా కీలక సమయంలో సఫారీలకు అండగా నిలిచాడు. తన ఇన్నింగ్స్‌తో దక్షిణాఫ్రికా పరిస్థితిని గాడిలో పెట్టే యత్నం చేశాడు. అతనికి బావుమా నుంచి సహకారం లభించడంతో అర్థ శతకాన్ని దాదాపు 90.00 స్ట్రైక్‌రేట్‌తో పూర్తి చేసుకున్నాడు. అంతకుముందు డుప్లెసిస్‌ మూడో వికెట్‌గా ఔటైన సంగతి తెలిసిందే. సోమవారం ఓవర్‌నైట్‌ ఆటగాడిగా దిగిన డుప్లెసిస్‌(1) ఆదిలోనే ఔటయ్యాడు. ఉమేశ్‌ యాదవ్‌ వేసిన బంతికి బోల్తా పడిన డుప్లెసిస్‌ తన వికెట్‌ను బౌల్డ్‌ రూపంలో సమర్పించుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement