కొరియాను కొట్టేస్తాం! | Growled Korea! | Sakshi
Sakshi News home page

కొరియాను కొట్టేస్తాం!

Sep 18 2014 12:57 AM | Updated on Sep 2 2017 1:32 PM

కొరియాను కొట్టేస్తాం!

కొరియాను కొట్టేస్తాం!

గురుసాయిదత్ ధీమా న్యూఢిల్లీ: సొంతగడ్డపై దక్షిణ కొరియా చేతిలో ఎదురైన ఓటమికి వారి దేశంలో బదులు తీర్చుకుంటామని భారత బ్యాడ్మింటన్ యువతార గురుసాయిదత్ తెలిపాడు.

గురుసాయిదత్ ధీమా
 న్యూఢిల్లీ: సొంతగడ్డపై దక్షిణ కొరియా చేతిలో ఎదురైన ఓటమికి వారి దేశంలో బదులు తీర్చుకుంటామని భారత బ్యాడ్మింటన్ యువతార గురుసాయిదత్ తెలిపాడు. గత మే నెలలో న్యూఢిల్లీలో జరిగిన థామస్ కప్ ప్రపంచ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో కొరియా 3-2తో భారత్‌ను ఓడించింది. ఈ ఓటమితో భారత్‌కు నాకౌట్ అవకాశాలు చేజారాయి. అయితే ఆసియా క్రీడల రూపంలో దక్షిణ కొరియాపై వారి గడ్డపైనే ప్రతీకారం తీర్చుకునే అవకాశం భారత్‌కు లభించిందని... దీనిని సద్వినియోగం చేసుకుంటామని కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్యం నెగ్గిన ఈ హైదరాబాదీ షట్లర్ తెలిపాడు. ‘డబుల్స్‌లో కొరియా అత్యంత పటిష్టంగా ఉంది. వారిని ఓడించాలంటే మూడు సింగిల్స్ మ్యాచ్‌ల్లో మేం తప్పనిసరిగా గెలవాలి. ఇది కష్టమే అయినప్పటికీ అసాధ్యం కాదు. ఇదే జరిగితే కొరియాను ఓడించగలుగుతాం’ అని రెండోసారి ఆసియా క్రీడల్లో పోటీపడనున్న గురుసాయిదత్ వివరించాడు. 
 కాస్త కష్టమే...: మరోవైపు కొరియాను కొరియాలో ఓడించడం కాస్త క్లిష్టమేనని చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అభిప్రాయపడ్డాడు. ‘ముందు పరిస్థితులను బేరీజు వేసుకోవాలి. మేం బాగా రాణిస్తామనే నమ్మకంతో ఉన్నాను. ప్రత్యర్థిని బట్టి మా వ్యూహ, ప్రతివ్యూహాలు ఉంటాయి. ఆసియా క్రీడల బ్యాడ్మింటన్‌లో భారత్‌కు గొప్పగా పతకాలు రాలేదు. అయితే ఇటీవల కామన్వెల్త్ గేమ్స్, ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత షట్లర్లు పతకాలు నెగ్గారు. అవే ఫలితాలు ఆసియా క్రీడల్లో పునరావృతం అవుతాయని ఆశిస్తున్నాను’ అని గోపీచంద్ తెలిపాడు. టీమ్ ఈవెంట్స్‌లో మొత్తం ఐదు మ్యాచ్‌లు జరుగుతాయి. భారత్ తరఫున సింగిల్స్‌లో కశ్యప్, శ్రీకాంత్, గురుసాయిదత్, సౌరభ్ బరిలోకి దిగుతారు. 
 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement