కరోనా భయం.. ఐపీఎల్‌ సాధ్యమేనా?

Growing Coronavirus Threat May Affect On IPL - Sakshi

న్యూఢిల్లీ: మనషుల ప్రాణాల్ని హరిస్తున్న కోవిడ్‌–19 వైరస్‌తో పెద్ద ముప్పే వచ్చిపడింది. ప్రపంచ వ్యాప్తంగా వర్తకం, వాణిజ్యం, ఔషధ, పర్యాటక, ఉత్పాదక రంగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న ఈ ‘కోవిడ్‌–19’ క్రీడలతోనూ ఓ ఆటాడుకుంటోంది.  ఇప్పటికే కోవిడ్‌ దెబ్బకు స్క్వాష్‌ ఆసియా టీమ్‌ చాంపియన్‌షిప్‌తో పాటు ఆసియా జూనియర్‌ స్క్వాష్‌ పోటీలు కూడా వాయిదా పడ్డాయి. మలేసియాలో జరగాల్సి ఉన్న అజ్లాన్‌ షా హాకీ టోర్నీతో పాటు, ఈ నెల 15 నుంచి జపాన్‌లో జరగాల్సిన రేస్‌ వాక్‌ కూడా వాయిదా పడింది. ఇప్పుడు కరోనా భయం  క్రికెట్‌ టోర్నీలకు తాకింది. నేపాల్‌ జరగాల్సి ఉన్న ఎవరెస్ట్‌ ప్రీమియర్‌ టీ20 లీగ్‌(ఈపీఎల్‌) వాయిదా పడింది. మార్చి 14 వ తేదీ నుంచి ఈ లీగ్‌ జరగాల్సి ఉండగా దానిని తాత్కాలికంగా రద్దు చేసినట్లు నేపాల్‌ క్రికెట్‌ బోర్డు తెలిపింది. కరోనా వైరస్‌ తగ్గుముఖం పట్టిన తర్వాతే దీన్ని రీ షెడ్యూల్‌ చేస్తామని ప్రకటించింది. (ఆటగాళ్లు... కరచాలనం వద్దు)

ఈ క్రమంలోనే భారత్‌లో నిర్వహించే ఐపీఎల్‌ తాజా ఎడిషన్‌ జరుగుతుందా.. లేదా అనే అనుమానాలు కూడా తలెత్తున్నాయి. ఇప్పటికే భారత్‌లో 30 కరోనా కేసులు నమోదైనట్లు తేలడంతో క్యాష్‌ రిచ్‌ లీగ్‌ అయిన ఐపీఎల్‌పై ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదు. ఈ నెల 29వ తేదీ నుంచి ఐపీఎల్‌ ఆరంభం కానున్న తరుణంలో ఆ లీగ్‌ సన్నాహకాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్‌ కారణంగా యావత్‌ ప్రపంచం వణికిపోతున్న సమయంలో ఐపీఎల్‌ నిర్వహణ సాధ్యమేనా అనే ప్రశ్నలు చోటు చేసుకుంటున్నాయి. ఈ లీగ్‌ నిర్వహణకు ఎటువంటి ఇబ్బంది ఉండదని భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ చెబుతున్నప్పటికీ లోలోపల ఏదో తెలియని భయం కూడా వెంటాడుతూనే ఉంది. ఐపీఎల్‌ నిర్వహణలో భాగంగా కరోనా వైరస్‌ను సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి అవసరమైన అన్ని జాగ్రత్తులు తీసుకుంటున్నామని గంగూలీ తెలిపాడు. ఐపీఎల్‌ సజావుగా సాగడానికి ముందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని గంగూలీ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్‌ ఆరంభం అయ్యే సమయానికి కరోనా ప్రభావం తగ్గుముఖం పడితే లీగ్‌ జరగడానికి ఎటువంటి సమస్య తలెత్తదు. కాని పక్షంలో ఐపీఎల్‌ నిర్వహణ అనేది కష్టంతో కూడుకున్న పనే అవుతుంది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top