క్వార్టర్స్‌లో గాయత్రి, సామియా | Gayatri and Samiya In Quarters of All India Ranking Badminton | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో గాయత్రి, సామియా

Jan 7 2019 10:32 AM | Updated on Jan 7 2019 10:32 AM

Gayatri and Samiya In Quarters of All India Ranking Badminton - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆలిండియా జూనియర్‌ ర్యాంకింగ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో తెలంగాణ ప్లేయర్లు పుల్లెల గాయత్రి, సామియా ఇమాద్‌ ఫరూఖీ, తరుణ్‌ క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్నారు. జైపూర్‌లో ఆదివారం జరిగిన బాలికల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో టాప్‌ సీడ్‌ గాయత్రి 21–19, 21–12తో తనీషా సింగ్‌ (ఉత్తరప్రదేశ్‌)పై గెలుపొందగా... ఏడో సీడ్‌ సామియా ఇమాద్‌ ఫరూఖీ 21–16, 21–12తో ఆషి రావత్‌ (ఢిల్లీ)ని ఓడించింది. బాలుర సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో తొమ్మిదో సీడ్‌ తరుణ్‌ 21–19, 21–16తో రెండోసీడ్‌  మైస్నమ్‌ మేరాబ (మణిపూర్‌)కు షాకిచ్చి క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. ఇతర ప్రిక్వార్టర్స్‌ మ్యాచ్‌ల్లో ఎనిమిదో సీడ్‌ సాయిచరణ్‌ కోయ (ఆంధ్రప్రదేశ్‌) 17–21, 21–19, 21–19తో శంకర్‌ ముత్తుస్వామిపై గెలుపొందగా.... ప్రణవ్‌ రావు గంధం (తెలంగాణ) 21–17, 22–24, 10–21తో సతీశ్‌ కుమార్‌ (తమిళనాడు) చేతిలో ఓడిపోయాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌ రెండోరౌండ్‌లో రెండోసీడ్‌ నవనీత్‌–సాహితి (తెలంగాణ) ద్వయం 27–25, 21–17తో రవికృష్ణ (కేరళ)– వర్షిణి (తమిళనాడు) జంటపై గెలుపొంది క్వార్టర్స్‌కు చేరుకుంది. బాలుర డబుల్స్‌ విభాగంలోనూ నవనీత్‌ జంట క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. ప్రిక్వార్టర్స్‌లో టాప్‌సీడ్‌ నవనీత్‌– విష్ణువర్ధన్‌ (తెలంగాణ) జంట 21–10, 21–14తో మొహమ్మద్‌ అమన్‌– ఖవర్‌ జమాల్‌ ఖాన్‌ (రాజస్తాన్‌) జోడీపై గెలిచింది.

ఇతర మ్యాచ్‌ల్లో ఖదీర్‌ మొయినుద్దీన్‌ (తెలంగాణ)–అరవింద్‌ (కేరళ) జంట 21–19, 21–13తో సూరజ్‌–అన్షుమన్‌ గొగోయ్‌ (అస్సాం) జంటపై, నితిన్‌ (కర్ణాటక)– వరప్రసాద్‌ (ఆంధ్రప్రదేశ్‌) జంట 21–11, 17–21, 21–14తో అరుణేశ్‌–గోకుల్‌ (తమిళనాడు) జోడీపై నెగ్గి క్వార్టర్స్‌కు చేరుకున్నాయి. శరత్‌ (ఆంధ్రప్రదేశ్‌)–అచ్యుతాదిత్య రావు (తెలంగాణ) ద్వయం 14–21, 18–21తో ఇషాన్‌ భట్నాగర్‌ (ఛత్తీస్‌గఢ్‌)–ఎడ్విన్‌ జాయ్‌ (కేరళ) జంట చేతిలో ఓడిపోయి రెండోరౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. బాలికల డబుల్స్‌ ప్రిక్వా ర్టర్స్‌లో సాహితి–నఫీసా జంటకు వాకోవర్‌ లభించింది. మరో మ్యాచ్‌లో శ్రీవిద్య గురజాడ–సాయి శ్రీయ (తెలంగాణ) ద్వయం 21–11, 21–13తో ఆర్య–లివియా ఫెర్నాండేజ్‌ (మహారాష్ట్ర) జంటపై నెగ్గి క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది.  

Advertisement
 
Advertisement
Advertisement