కోల్‌కతాతోనే గంభీర్, నరైన్! | Gautam Gambhir, Sunil Narine set to be retained by Kolkata Knight Riders | Sakshi
Sakshi News home page

కోల్‌కతాతోనే గంభీర్, నరైన్!

Jan 5 2014 1:00 AM | Updated on Sep 2 2017 2:17 AM

కెప్టెన్ గౌతమ్ గంభీర్, మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్‌లను వచ్చే ఐపీఎల్‌లోనూ తమ వద్దనే కొనసాగించుకోవాలని కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) ఫ్రాంచైజీ భావిస్తోంది.

 న్యూఢిల్లీ: కెప్టెన్ గౌతమ్ గంభీర్, మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్‌లను వచ్చే ఐపీఎల్‌లోనూ తమ వద్దనే కొనసాగించుకోవాలని కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) ఫ్రాంచైజీ భావిస్తోంది. ఈ ఇద్దర్ని రిటైన్ చేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఐపీఎల్ తొలి మూడు సీజన్లలో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన గంభీర్... 2011లో కేకేఆర్‌తో జతకట్టాడు. 2012లో జట్టుకు తొలి టైటిల్‌ను అందించాడు.
 
  తొలి సీజన్ (కేకేఆర్‌తో)లో జట్టును ప్లే ఆఫ్ వరకు తీసుకెళ్లినా...ఎలిమినేటర్‌లో ఓటమిపాలైంది. గతేడాది సీజన్‌లో జట్టు ప్లే ఆఫ్‌కు అర్హత సాధించలేకపోయింది. ఇప్పటి వరకు లీగ్‌లో 88 మ్యాచ్‌లు ఆడిన గౌతీ 2471 పరుగులు చేశాడు. ‘రాబోయే సీజన్‌కు గంభీర్‌ను కొనసాగిస్తాం. మా జట్టుకు అతను అద్భుతమైన సారథి. కేకేఆర్ అభిమానులకు గంభీర్ అంటే చాలా ఇష్టం. తనని కొనసాగించడానికి ఇది కూడా ఓ కారణం. అలాగే నరైన్‌పై కూడా దృష్టిపెట్టాం. ఐపీఎల్‌లో పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లూ తీస్తుండటంతో అందరి దృష్టి అతనిపై నెలకొంది’ అని కేకేఆర్ అధికారి ఒకరు తెలిపారు.
 
 శ్రమించి జట్టులోకి వస్తా
 ఫ్లాట్ వికెట్‌పై భారీగా పరుగులు చేసి జాతీయ జట్టులోకి పునరాగమనం చేయడం తనకు ఇష్టం లేదని గంభీర్ అన్నాడు. కఠినంగా శ్రమించి జట్టులో చోటు దక్కించుకుంటానన్నాడు. ‘స్వార్థ ప్రయోజనాల కోసం నేను క్రికెట్ ఆడను. ఫ్లాట్ వికెట్‌పై పరుగుల వరద పారించడం నాకు ఇష్టం ఉండదు. పోటీ నుంచి తప్పుకోవడం నాకు నచ్చదు. ఢిల్లీ జట్టుకు కచ్చితమైన విజయాలు కావాలి. కాబట్టే రోషనార క్లబ్‌లో ఫ్లాట్ వికెట్ కాకుండా పచ్చిక ఉండే పిచ్ కావాలని అడిగా. నేనేమీ కావాలని అలా చేయలేదు. జట్టు కోసం చేశా. ఫ్లాట్ వికెట్‌పై ఆడితే భారీ పరుగులు చేసేవాణ్ని’ అని గౌతీ వ్యాఖ్యానించాడు. కివీస్ పర్యటనకు జట్టులో చోటు దక్కనందుకు ఎలాంటి బాధ లేదన్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement