‘ధోని, గంగూలీలతో పోలిస్తే కోహ్లి సెపరేటు’ | Sakshi
Sakshi News home page

‘ధోని, గంగూలీలతో పోలిస్తే కోహ్లి సెపరేటు’

Published Mon, Oct 14 2019 12:17 PM

Gambhir Explains What Separates Between Kohli And Others - Sakshi

న్యూఢిల్లీ:  భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిపై మాజీ ఓపెనర్‌, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్‌ ప్రశంసలు కురిపించారు. టీమిండియా వరుస విజయాలు సాధించడంతో పాటు విదేశీ గడ్డపై కూడా తమ సత్తా చాటడానికి కోహ్లి నాయకత్వమే కారణమని కొనియాడాడు. కోహ్లిని ఒక భయం లేని భారత కెప్టెన్‌గా గంభీర్‌ అభివర్ణించారు. ఇక్కడ గత టీమిండియా కెప్టెన్లు సౌరవ్‌ గంగూలీ, రాహుల్‌ ద్రవిడ్‌, ఎంఎస్‌ ధోనిలతో పోలిక తెచ్చారు గంభీర్‌. వీరితో పోలిస్తే కోహ్లి ఒక ప్రత్యేకమైన కెప్టెన్‌గా గంభీర్‌ అభిప్రాయపడ్డాడు.

‘సౌరవ్‌ గంగూలీ, ద్రవిడ్‌, ఎంఎస్‌ ధోనిల కంటే విరాట్‌ది ఒక ప్రత్యేకమైన ముద్ర. విదేశాల్లో సైతం ఘనమైన విజయాలను సాధించడాన్ని కోహ్లి సృష్టించాడు. ఈ విషయంలో గంగూలీ, ద్రవిడ్‌, ధోనిల కంటే కోహ్లినే అత్యుత్తమం. రిస్క్‌ చేయడానికి కోహ్లి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. కానీ మిగతా వారిలా కాకుండా నిర్ణయాలు తీసుకోవడంలో ముందుంటాడు. విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడు ఐదుగురు బౌలర్లతో ఆడిన ఘనత సారథిగా కోహ్లికే దక్కుతుంది. గతంలో భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లినప్పుడు ఒక టెస్టు మ్యాచ్‌లో హార్దిక్‌ పాండ్యాతో కలుపుకుని ఐదుగురు ఫాస్ట్‌ బౌలర్లతో బరిలోకి దిగి సక్సెస్‌ అయ్యాడు కోహ్లి. ఇలా చేయడం రిస్క్‌ అని తెలిసినా కోహ్లి ముందడుగు వేశాడు. కోహ్లి ఒక ఫియర్‌లెస్‌ కెప్టెన్‌’ అని గంభీర్‌ పేర్కొన్నారు.

ఆదివారం ముగిసిన దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో భారత్‌ ఇన్నింగ్స్‌ 137 పరుగుల తేడాతో విజయం సాధించి కొత్త అధ్యాయాన్ని లిఖించింది. స్వదేశంలో వరుసగా అత్యధిక టెస్టు సిరీస్‌లు గెలిచిన జట్టుగా చరిత్ర సృష్టించింది. ఇది భారత్‌లో టీమిండియాకు వరుసగా 11వ సిరీస్‌ విజయం. దాంతో ఆసీస్‌ను వెనక్కినెట్టింటి టీమిండియా. అయితే భారత​ సాధించిన 11 వరుస స్వదేశీ టెస్టు సిరీస్‌ విజయాల్లో 9 కోహ్లి నేతృత్వంలోనే సాధించడం ఇక్కడ మరో విశేషం. 2014-15 సీజన్‌లో ఎంఎస్‌ ధోని నుంచి కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న కోహ్లి.. సొంత గడ్డపై  ఒక్క టెస్టు సిరీస్‌ను కూడా కోల్పోలేదు.

ఓవరాల్‌గా చూస్తే కోహ్లి నాయకత్వంలో భారత్‌కు 13వ సిరీస్‌ విజయం. ఇది ఒక భారత కెప్టెన్‌గా అత్యుత్తమం. అంతకుముందు 12 సిరీస్‌ విజయాలతో ధోని ఉండగా, దాన్ని కోహ్లి బ్రేక్‌ చేశాడు. కోహ్లి పగ్గాలు చేపట్టిన తర్వాత రెండు సందర్భాల్లో మాత్రమే భారత్‌ టెస్టు సిరీస్‌లు కోల్పోయింది.  2017-18 దక్షిణాఫ్రికా పర్యటనలో సిరీస్‌ కోల్పోయిన కోహ్లి నేతృత్వంలోని భారత్‌.. 2018లో ఇంగ్లండ్‌లో సిరీస్‌ను చేజార్చుకుంది. ఈ ఏడాది ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ల్లో భారత్‌ సిరీస్‌ గెలుచుకుంది.

Advertisement
Advertisement