ఈడెన్ గార్డెన్స్‌లో ఫైనల్ | Sakshi
Sakshi News home page

ఈడెన్ గార్డెన్స్‌లో ఫైనల్

Published Wed, Jul 22 2015 1:05 AM

ఈడెన్ గార్డెన్స్‌లో ఫైనల్

- చెన్నైలోనూ మ్యాచ్‌లు
- టి20 ప్రపంచకప్ వేదికలు ఖరారు
న్యూఢిల్లీ:
దాదాపు మూడు దశాబ్దాల తర్వాత కోల్‌కతాలోని ప్రతిష్టాత్మక ఈడెన్ గార్డెన్స్ క్రికెట్ ప్రపంచ కప్ తుదిపోరుకు వేదిక కానుంది. వచ్చే ఏడాది భారత్‌లో జరిగే టి20 వరల్డ్ కప్ ఫైనల్ (ఏప్రిల్ 3న)ను ఈడెన్ గార్డెన్స్‌లో నిర్వహించనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. 1987 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌కు ఆతిథ్యం ఇచ్చిన ఈ చారిత్రాత్మక మైదానంలో 2011 వన్డే ప్రపంచకప్‌లో మూడు అప్రాధాన్య మ్యాచ్‌లు జరిగాయి. వరల్డ్ కప్ నిర్వహించే ఎనిమిది వేదికలను బోర్డు మంగళవారం ప్రకటించింది.

కోల్‌కతా, ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, మొహాలీ, ధర్మశాల, నాగపూర్ ఈ జాబితాలో ఉన్నాయి. గత ఐదు టి20 ప్రపంచకప్‌లతో పోలిస్తే మూడుకంటే ఎక్కువ వేదికల్లో ఈ టోర్నమెంట్ జరుగుతుండటం ఇదే తొలిసారి. ఢిల్లీ, ముంబైలలో ఒక్కో సెమీ ఫైనల్ మ్యాచ్ నిర్వహించే అవకాశం ఉంది. ఒక వేళ ఏదైనా కారణంతో ఢిల్లీలో సెమీస్‌కు అవకాశం లేకపోతే అక్కడ భారత్-పాకిస్తాన్‌లాంటి కీలక మ్యాచ్ నిర్వహిస్తామని బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.

చెన్నైలోని చిదంబరం స్టేడియంలో మూడు స్టాండ్‌లకు సంబంధించి ఇంకా వివాదం కొనసాగుతూనే ఉన్నా... దానికీ మ్యాచ్‌లు కేటాయించారు. అయితే తగిన సమయంలో సమస్యను పరిష్కరించుకొని ఐసీసీ నిబంధనల ప్రకారం స్టేడియాన్ని సిద్ధం చేయాలని లేదంటే మ్యాచ్‌లు కోల్పోతారని బీసీసీఐ, తమిళనాడు క్రికెట్ అసోసియేషన్‌కు సమాచారం అందించినట్లు తెలిసింది. మరో వైపు ఎనిమిది మంది సభ్యులతో కూడిన టి20 ప్రపంచకప్ మేనేజింగ్ కమిటీని కూడా బీసీసీఐ ఏర్పాటు చేసింది. బోర్డు ఉపాధ్యక్షుడు గోకరాజు గంగరాజు ఇందులో సభ్యులుగా ఉన్నారు.

Advertisement
Advertisement