కొలంబియా కొత్త చరిత్ర | Fatal Shooting Near Downtown Columbia | Sakshi
Sakshi News home page

కొలంబియా కొత్త చరిత్ర

Jun 30 2014 1:18 AM | Updated on Oct 22 2018 5:58 PM

కొలంబియా కొత్త చరిత్ర - Sakshi

కొలంబియా కొత్త చరిత్ర

ఫిఫా’ ప్రపంచకప్ ఫుట్‌బాల్‌లో కొలంబియా చరిత్ర సృష్టించింది. గ్రూప్ దశలో ‘హ్యాట్రిక్’ విజయాలు నమోదు చేసిన ఈ దక్షిణ అమెరికా జట్టు అదే జోరును కొనసాగిస్తూ శనివారం అర్ధరాత్రి జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ఉరుగ్వేకు షాక్ ఇచ్చింది.

తొలిసారి క్వార్టర్స్‌లోకి ప్రవేశం
ఉరుగ్వేపై 2-0తో సంచలన విజయం
జేమ్స్ ‘డబుల్’ ధమాకా
 
 రియో డి జనీరో: ‘ఫిఫా’ ప్రపంచకప్ ఫుట్‌బాల్‌లో కొలంబియా చరిత్ర సృష్టించింది. గ్రూప్ దశలో ‘హ్యాట్రిక్’ విజయాలు నమోదు చేసిన ఈ దక్షిణ అమెరికా జట్టు అదే జోరును కొనసాగిస్తూ శనివారం అర్ధరాత్రి జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ఉరుగ్వేకు షాక్ ఇచ్చింది. 22 ఏళ్ల మిడ్‌ఫీల్డర్ జేమ్స్ రోడ్రిగ్వెజ్ రెండు అద్భుతమైన గోల్స్ సాధించడంతో కొలంబియా 2-0తో ‘రెండుసార్లు చాంపియన్’ ఉరుగ్వేను చిత్తుచేసి ప్రపంచకప్ చరిత్రలో తొలిసారిగా క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది.
 
 మరోవైపు సస్పెన్షన్ కారణంగా లూయిస్ స్వారెజ్ జట్టులో లేకపోవడం ఉరుగ్వే ఆటపై ప్రభావం చూపింది. ఫలితంగా గత ప్రపంచకప్‌లో నాలుగో స్థానంలో నిలిచిన ఉరుగ్వే ఈసారి ప్రిక్వార్టర్స్‌లోనే ఇంటిముఖం పట్టింది. జూలై 4న ఫోర్టలెజాలో జరిగే క్వార్టర్స్‌లో ఆతిథ్య బ్రెజిల్‌తో కొలంబియా తలపడుతుంది.
 
 గ్రూప్ దశలో ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వని కొలంబియా నాకౌట్ స్టేజ్‌లోనూ అదే ఊపును కొనసాగించింది. తనకన్నా మెరుగైన ర్యాంకున్న ఉరుగ్వేపై ఆరంభం నుంచే పైచేయి సాధించింది.
 
 ఎక్కువ శాతం బంతిని తన ఆధీనంలోనే ఉంచుకున్న కొలంబియా 28వ నిమిషంలో ఖాతా తెరిచింది. గ్రూప్ దశలో మూడు గోల్స్ కొట్టి మంచి ఫామ్‌లో ఉన్న జేమ్స్ రోడ్రిగ్వెజ్ పెనాల్టీ ఏరియా బయట బంతిని అందుకుని 20 గజాల దూరం నుంచి ఎడమ కాలితో కిక్ చేశాడు. ఉరుగ్వే గోల్ కీపర్ ముస్లెరా చేతి వేళ్లను తాకుతూ బంతి గోల్‌పోస్ట్‌లోకి వెళ్లింది.
 
 లూయిస్ స్వారెజ్ లేకపోయినా ప్రత్యర్థిపై ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు ఉరుగ్వే ప్రయత్నించింది. అయితే కొలంబియా డిఫెన్స్‌ను మాత్రం ఛేదించడంలో విఫలమైంది.
 
 దీంతో తొలి అర్ధభాగం ముగిసేసరికి కొలంబియా 1-0 ఆధిక్యంలో నిలిచింది.
 
 ద్వితీయార్ధంలో అదే జోరును కొనసాగించిన కొలంబియా ఐదు నిమిషాలకే(50వ నిమిషంలో) రెండో గోల్ నమోదు చేసింది. పాబ్లో అర్మెరో అద్భుతమైన క్రాస్‌ను జ్వాన్ క్వాడ్రడో గోల్‌పోస్ట్ వైపు పంపాడు. అక్కడే పొంచి ఉన్న రోడ్రిగ్వెజ్ బంతిని గోల్‌గా మలచడంతో కొలంబియా 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
 
 ఆ తర్వాత కొలంబియా ఆధిక్యాన్ని తగ్గించేందుకు ఉరుగ్వే ప్రయత్నాలు చేసినా లాభం లేకుండా పోయింది.
 
 నిర్ణీత సమయంలో మరో గోల్ నమోదు కాకపోవడంతో ఉరుగ్వేకు ఓటమి తప్పలేదు.
 
 రెండు గోల్స్ సాధించి కొలంబియా విజయంలో కీలక పాత్ర పోషించిన రోడ్రిగ్వెజ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
 
 ఈ ప్రపంచకప్‌లో రోడ్రిగ్వెజ్ ఐదు గోల్స్‌తో ‘గోల్డెన్ బూట్’ రేసులో దూసుకుపోతున్నాడు. జర్మనీకి చెందిన థామస్ ముల్లర్ నాలుగు గోల్స్‌తో ఆ తర్వాతి స్థానంలో ఉన్నాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement