ఇంగ్లండ్‌దే వన్డే సిరీస్‌

England Seal Series As Roy, Stokes Guide 341 Chase - Sakshi

నాటింగ్‌హామ్‌: సొంతగడ్డపై ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్టు చెలరేగిపోతోంది. మూడొందలకు పైగా టార్గెట్‌ను సైతం మరోసారి ఛేదించి తమకు తిరుగులేదని నిరూపించుకుంది. పాకిస్తాన్‌తో ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇక్కడ జరిగిన నాల్గో వన్డేలో ఇంగ్లండ్‌ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా సిరీస్‌ను ఇంకా మ్యాచ్‌ ఉండగానే కైవసం చేసుకుంది. పాకిస్తాన్‌ నిర్దేశించిన 341 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌ కడవరకూ పోరాడి విజయాన్ని సాధించింది.

ముందుగా బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్‌ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 340 పరుగులు చేసింది. బాబర్‌ అజమ్‌(115) సెంచరీ సాధించడంతో పాకిస్తాన్‌ భారీ స్కోరు చేసింది. అయితే ఆ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌కు శుభారంభం లభించింది. తొలి వికెట్‌కు ఇంగ్లండ్‌ 94 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన తర్వాత జేమ్స్‌ విన్సే(43) ఔటయ్యాడు. కాగా, మరో ఓపెనర్‌ జాసన్‌ రాయ్‌ దూకుడుగా బ్యాటింగ్‌ చేశాడు. రాయ్‌(114) శతకం సాధించడంతో పాటు రెండో వికెట్‌కు 107 పరుగులు జత చేసిన తర్వాత పెవిలియన్‌ చేరాడు. ఆపై జో రూట్‌(36), జోస్‌ బట్లర్‌(0)లు బంతి వ్యవధిలో ఔట్‌ కావడంతో ఇంగ్లండ్‌ 208 పరుగుల వద్ద నాల్గో వికెట్‌ను నష్టపోయింది. ఇక మొయిన్‌ అలీ కూడా డకౌట్‌గా నిష్క్రమించడంతో ఇంగ్లండ్‌ కష్టాల్లో పడింది.  కాగా,  స్టోక్స్‌(71 నాటౌట్‌) సమయోచితంగా బ్యాటింగ్‌ చేయగా, టామ్‌ కరాన్‌(31), ఆదిల్‌ రషీద్‌(12 నాటౌట్‌)లు తమ వంతు పాత్ర పోషించడంతో ఇంగ్లండ్‌ 49.3 ఓవర్లలో విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సిరీస్‌లో తొలి వన్డే ఫలితం రాకపోగా, రెండు, మూడు, నాల్గో వన్డేల్లో ఇంగ్లండ్‌ గెలిచింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top