ఐపీఎల్‌: బీసీసీఐకి భారీ షాక్‌

Enforcement Directorate Slaps Heavy Penality on BCCI - Sakshi

సాక్షి, ముంబై: భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం(ఈడీ) షాకిచ్చింది. 2009 ఐపీఎల్‌ సీజన్‌ నిర్వాహణకు సంబంధించి బీసీసీఐకి భారీ జరిమానాను విధించింది. బీసీసీఐతోపాటు మాజీ సభ్యులకు కలిపి మొత్తం రూ. 121 కోట్ల జరిమానా విధిస్తూ నోటీసులు జారీ చేసింది.

2009 ఐపీఎల్‌ సీజన్‌ను సౌతాఫ్రికాలో నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఆర్బీఐ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ.. విదేశీ ఖాతా తెరవకుండానే రూ. 243 కోట్లను టోర్నీ నిర్వహణ కోసం బీసీసీఐ సౌతాఫ్రికాకు బదిలీ చేసింది. విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) అతిక్రమణ ఆరోపణలతో రంగంలోకి దిగిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ దర్యాప్తు చేపట్టింది. ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్లు నిర్ధారణ కావటంతో భారీ జరిమానాను విధించింది.

బీసీసీఐతోపాటు బోర్డు మాజీ అధ్యక్షుడు ఎన్‌ శ్రీనివాసన్‌తోపాటు ఐపీఎల్‌ మాజీ కమిషనర్‌ లలిత్‌ మోదీ, ఇతరులకు కలిపి ఈడీ రూ.121 కోట్ల జరిమానా విధించింది. బీసీసీఐకు రూ. 82.66 కోట్లు శ్రీనివాసన్‌కు రూ.11.53 కోట్లు, లలిత్‌ మోదీకి రూ.10.65 కోట్లు, బోర్డు మాజీ కోశాధికారి పాండవ్‌కు రూ. 9.72 కోట్లు, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ట్రావెన్‌కోర్‌ (ఎస్‌బీఐతో విలీనమైంది)కు రూ.7 కోట్లను జరిమానాగా విధించింది. ఈ జరిమానాను 45రోజుల్లోగా చెల్లించాలంటూ ఈడీ ఆదేశించింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top