
కోల్‌కతా : అర్జెంటీనా ఫుట్ బాల్ దిగ్గజం డిగో మారడోనాకు అరుదైన గౌరవం దక్కింది. నగరంలో ఆయన విగ్రహాన్ని నెలకొల్పారు. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి స్వయంగా మారడోనానే హాజరుకావటం విశేషం. అంతేకాదు ఓ పార్క్‌కు కూడా ఆయన పేరును పెట్టేశారు.
ఈ సందర్భంగా మారడోనా భావోద్వేగానికి లోనయ్యారు. ప్రజలంతా నన్ను ఫుట్ బాల్ దేవుడంటారు.. కానీ, నేనొక సాధారణ ఆటగాడిని మాత్రమే. మీ ఆదరణాభిమానాలే నన్ను ఇంత వాడిని చేశాయి. విగ్రహం నెలకొల్పే అర్హత నాకు ఉందో లేదో తెలీదు. కానీ, మీరు నాపై చూపించే అభిమానానికి నేను ఎప్పుడూ బానిసనే. భారత్‌తో మాత్రం నా అనుబంధం ఎప్పటికీ విడదీయలేనిది అని మారడోనా తెలిపారు.
అంతేకాదు 11 మంది కేన్సర్ పెషంట్లకు 10 వేల రూపాయల చొప్పున చెక్ అందించిన ఆయన.. ఓ ఆస్పత్రికి ఎయిర్ ఆంబులెన్స్ ను కూడా అందజేశాడు. 1986 వరల్డ్ కప్ పట్టుకున్న ఫోటోతో ఆయన విగ్రహం నెలకొల్పగా.. దాని పక్కనే ఆయన నిల్చుని ఫోటోలు దిగి సందడి చేశారు.
కాగా, మారడోనా 2008లో చివరిసారిగా ఇండియాకు వచ్చారు. తిరిగి 9 ఏళ్ల తర్వాత కోల్‌కతా పర్యటనకు వచ్చారు. నిజానికి ఆయన సెప్టెంబర్‌లోనే పర్యటనకు రావాల్సి ఉన్నప్పటికీ.. కాస్త ఆలస్యం అయ్యింది. ఇక పర్యటనలో భాగంగా మారడోనా క్రికెట్ దిగ్గజం సౌరవ్ గంగూలీతో ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్ లో తలపడబోతున్నారు. ‘డిగో వర్సెస్ దాదా’ పేరుతో బరసత్‌లో ఈ మ్యాచ్‌ను నిర్వహించబోతున్నారు.