
మాస్కో: ఫుట్‌బాల్ ప్రపంచకప్ స్టేడియాల్లో పొగ తాగకూడదన్న నిబంధనను అర్జెంటీనా దిగ్గజ ఆటగాడు డిగో మారడోనా ఉల్లంఘించడంపై అతనిపై చర్యలకు రంగం సిద్ధమైంది. ఇటీవల అర్జెంటీనా-ఐస్‌లాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో మారడోనా స్టేడియంలో గ్యాలరీలో పొగ తాగుతూ కనిపించాడు. అయితే తనకు స్టేడియాల్లో పొగ తాగుకూడదనే నిబంధనను ప్రవేశపెట్టడం తెలియదంటున్నాడు మారడోనా. అయితే తన తప్పు తెలుసుకున్న మారడోనా తనను క్షమించాలని కోరాడు.
ఫుట్‌బాల్ ప్రపంచకప్ పోటీలు జరిగే సమయంలో అభిమానులు పొగతాగేందుకు గతంలో అనుమతి ఉండేది. కానీ, ఈ ఏడాది పోటీలు జరిగే సమయంలో స్టేడియం లోపల పొగ తాగడంపై టోర్నీ నిర్వాహకులు నిషేధం విధించారు. దీంతో మారడోనాపై చర్యలు తీసుకునే పనిలో ఉన్నారు అధికారులు. ఆదివారం మారడోనా తన ఇన్‌స్టాగ్రాం అకౌంట్ ద్వారా క్షమాపణ కోరాడు. ‘స్టేడియంలో పొగ తాగకూడదన్న కొత్త నిబంధన గురించి నాకు నిజంగా తెలియదు. టోర్నీ నిర్వాహకులతో పాటు ప్రతి ఒక్కరినీ క్షమాపణలు కోరుతున్నాను’ అని మారడోనా పేర్కొన్నారు.