‘ధోని.. మిస్టర్‌ కూల్‌ కాదు’

Dhoni Loses Cool Couple Of times, Gautam Gambhir - Sakshi

నా కంటే కూల్‌ కెప్టెన్‌: గంభీర్‌

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనికి మరోపేరు మిస్టర్‌ కూల్‌. మైదానంలో ప్రశాంత చిత్తంతో తన పని తాను చేసుకుపోతాడు కాబట్టి ధోనికి ఆ బిరుదును కట్టబెట్టారు. ఇది ప్రతీ ఒక్క క్రికెట్‌ అభిమానికి తెలిసిన విషయం. అయితే కొన్ని సందర్భాల్లో తన కను సైగలతో ధోని ఆటగాళ్లకు సూచనలు ఇస్తూ ఒత్తిడిని తగ్గించుకుంటూ ఉంటాడు. కానీ ప్రజలు అనుకున్నట్లు ధోని ‘మిస్టర్‌ కూల్‌’ ఏమీ కాదని అంటున్నాడు మాజీ ఓపెనర్‌ గౌతం గంభీర్‌.  లాక్‌డౌన్ సందర్బంగా ఇంటికే పరిమితమైన ప్రస్తుత క్రికెటర్లు, మాజీ క్రికెటర్లు ధోనితో క్షణాలను నెమరవేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ధోనితో జ్ఞాపకాలను గౌతం గంభీర్‌ పంచుకున్నాడు.  అంతా ధోని కూల్‌ అనుకుంటారు.. కానీ అందులో వాస్తవం లేదన్నాడు. తాను చాలాసార్లు ధోని కోపోద్రిక్తుడైన సందర్భాలను చూశానన్నాడు. (షమీ...నేను పిచ్చోణ్ని కాదు!)

‘2007 వరల్డ్‌కప్‌ను చూసుకున్నా, మిగతా వరల్డ్‌కప్‌లను చూసినా ధోని ఆవేశాన్ని ప్రదర్శిస్తూనే వస్తున్నాడు. అతను కూడా మనిషే కాబట్టి కోపం అనేది సహజం. ఇక ఐపీఎల్‌లో సీఎస్‌కే తరఫున కెప్టెన్‌గా చేస్తున్న ధోని.. ఎవరైనా క్యాచ్‌ వదిలేసిన క్రమంలో ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. భారత్‌కు కెప్టెన్లుగా చేసిన మిగతా వారి కంటే ధోని కూల్‌ అనేది వాస్తవం. అంతేకానీ ప్రతీ విషయంలోనూ ధోని కూల్‌ కాదు. నా కంటే చాలా కూల్‌ ధోని’ అని గంభీర్‌ తెలిపాడు. 2007 టీ20 వరల్డ్‌కప్‌ గెలిచిన భారత జట్టులో గంభీర్‌ సభ్యుడు. అలాగే 2011 వన్డే వరల్డ్‌కప్‌ గెలిచిన టీమిండియా జట్టులో కూడా గంభీర్‌ సభ్యుడిగా ఉండటమే కాకుండా కప్‌ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ రెండు మెగా టోర్నీలకు ధోనినే కెప్టెన్‌.2014 న్యూజిలాండ్ పర్యటనలో ఓ బౌన్స‌ర్ వేసి ధోని తో చివాట్లు తిన్న విషయాన్ని పేసర్‌ మహ్మద్‌ షమీ ఇటీవల గుర్తు చేసుకున్నాడు. ఆ టూర్ రెండో టెస్ట్‌లో క్యాచ్ డ్రాప్ చేయడంతో సహనం కోల్పోయిన తాను బౌన్సర్ వేసానని, అది కాస్త ధోనికి అందకుండా బౌండరీకి వెళ్లిందన్నాడు. దీంతో లంచ్ బ్రేక్‌కు వెళ్తున్న సమయంలో ధోని తనవద్దకు వచ్చి వేషాలు వేయొద్దంటూ వార్నింగ్‌ ఇచ్చాడన్నాడు.  (ఆసీస్‌కు నంబర్‌వన్‌ ర్యాంక్‌ ఎలా ఇచ్చారు?)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top