అందుకే ధోని బెస్ట్‌ కెప్టెన్‌: రోహిత్‌

Dhoni Is The Best Captain India Has Seen, Rohit Sharma - Sakshi

మౌంట్‌మాంగని: భారత క్రికెట్‌ జట్టును మరోస్థాయికి తీసుకెళ్లిన కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని.  ఏ ఒక్క భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌కు సాధ్యం కాని మూడు ఐసీసీ ట్రోఫీలను తన నాయకత్వంలో ధోని సాధించాడు. 2007 టీ20 వరల్డ్‌కప్‌, 2011 వన్డే వరల్డ్‌కప్‌లతో పాటు 2013లో చాంపియన్స్‌ ట్రోఫీలను ధోని సారథ్యంలోనే టీమిండియా సాధించింది. ధోని కంటే ముందు ఈ మూడు ట్రోఫీలను ఏ భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ సాధించకపోగా, ఆ తర్వాత కూడా ఇప్పటివరకూ ఆ మెగా ట్రోఫీలను ఏ టీమిండియా సారథి సాధించలేకపోయాడు. దాంతో టీమిండియా సక్సెస్‌ఫుల్‌ కెప్టెనే కాదు.. కెప్టెన్‌ కూల్‌ కూడా అయ్యాడు ధోని.(ఇక్కడ చదవండి: బుమ్రా నయా వరల్డ్‌ రికార్డు)

మైదానంలో ప్రశాంతంగా ఉంటూనే తన పని తాను చేసుకుపోవడంలో ధోని సిద్ధహస్తుడు.  ఇప్పటికీ తమ అత్యుత్తమ టీమిండియా కెప్టెన్‌ ధోనినే అని సహచర క్రికెటర్లే స్పష్టం చేస్తున్నారంటే అతనికి ఎంతో ప్రత్యేకత ఉందో గుర్తు చేసుకోవచ్చు. ఇటీవల టీమిండియా స్పిన్నర్‌ యజ్వేంద్ర చహల్‌ ఇదే విషయాన్ని స్పష్టం చేయగా, ఇప్పుడు ఓపెనర్‌ రోహిత్‌ శర్మ కూడా ధోనిపై ప్రశంసలు కురిపించాడు. అసలు ధోని ఎందుకంత స్పెషల్‌ అయ్యాడో వివరించాడు.‘ ధోని మైదానంలో చాలా ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటాడు. అది అతనిలో ఉన్న సహజ లక్షణంగా కనిపిస్తుంది. ధోనిలో ఉన్న లక్షణాలు అతను మంచి నిర్ణయాలు తీసుకోవడానికి దోహదం చేయడంలో సహకరించాయి. ధోని ఎలా సక్సెస్‌ఫుల్‌ కెప్టెన్‌ అయ్యాడు అందరికీ తెలుసు. మూడు ఐసీసీ ట్రోఫీలు, మూడు ఐపీఎల్‌ టైటిల్స్‌ సాధించాడు. భారత క్రికెట్‌ చూసిన అత్యుత్తమ కెప్టెన్‌ ధోని.

పరిస్థితుల్ని బట్టి నిర్ణయాలు తీసుకోవడంలో ధోనికి ధోనినే సాటి. ఎంతో ప్రశాంతంగా ఉంటాడు. యువ బౌలర్లకు కావాల్సిన స్వేచ్ఛ ఇస్తాడు. ప్రత్యేకంగా మ్యాచ్‌ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు బౌలర్ల నుంచి ఫలితాలు బాగా రాబడతాడు. బౌలర్లు ఒత్తిడిలో పడకుండా వారిని బాగా సమన్వయ పరుస్తాడు. ఏ రకంగా బంతులు వేయాలనే దానిపై ఇచ్చే సలహాలు, బౌలర్‌కు చేతికి బంతి ఇచ్చి బాధ్యతను అప్పగించడం అంతా ఒక పద్ధతిలో ఉంటుంది. ఈ క్రమంలో బౌలర్‌పై ఒత్తిడి తీసుకురాడు. ఏ యువ ఆటగాడినైనా ఒక సీనియర్‌ క్రికెటర్‌ తరహాలోనే ట్రీట్‌ చేస్తాడు. వారిపై నమ్మకం ఉంచుతాడు.. అలాగే ఫలితాల్ని కూడా అందుకుంటాడు. అందుకే ధోని బెస్ట్‌ కెప్టెన్‌. భారత క్రికెట్‌ జట్టుకు ధోని ఎప్పటికీ బెస్ట్‌ కెప్టెనే’ అని రోహిత్‌ తెలిపాడు. ఇదిలా ఉంచితే, న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను 5-0తో క్లీన్‌స్వీప్‌ చేసిన టీమిండియా.. ఇప్పుడు వన్డే సిరీస్‌కు సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డే బుధవారం జరుగనుంది. (ఇక్కడ చదవండి: అతడు టీమిండియా ఎక్స్‌ ఫ్యాక్టర్‌: అక్తర్‌)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top