సఫారీతో హోరాహోరీ తప్పదు: కివీస్ కోచ్ హెస్సన్ | Sakshi
Sakshi News home page

సఫారీతో హోరాహోరీ తప్పదు: కివీస్ కోచ్ హెస్సన్

Published Mon, Mar 23 2015 12:41 AM

సఫారీతో హోరాహోరీ తప్పదు: కివీస్ కోచ్ హెస్సన్ - Sakshi

ఆక్లాండ్: ప్రపంచంలో బెస్ట్ అనుకున్న నాలుగు జట్లే వరల్డ్‌కప్ సెమీస్‌కు చేరుకున్నాయని న్యూజిలాండ్ కోచ్ మైక్ హెస్సన్ అన్నారు. ఇందులో చర్చించడానికి ఏమీ లేదన్నారు. వన్డేల్లో దిగ్గజ జట్ల సరసన చోటు సాధించే సత్తా తమకు ఉందన్నారు. ‘సెమీస్‌కు చేరిన నాలుగు జట్లు ప్రస్తుతం అత్యంత పటిష్టంగా ఉన్నాయి. దీన్ని కొంత మంది అంగీకరించకపోయినా ఫర్వాలేదు’ అని హెస్సన్ పేర్కొన్నారు. మరోవైపు విండీస్‌పై ఘనవిజయం సాధించిన కివీస్‌ను స్థానిక మీడియా ఆకాశానికెత్తేసింది. వచ్చే మంగళవారం దేశం మొత్తానికి హాలీడే అని ఓ రేడియో స్టేషన్ వ్యాఖ్యానించింది.
 
 తమ జట్టు సెమీస్‌కు చేరుకున్నందుకు విశేషంగా సంబరాలు చేసుకుంటున్న అభిమానులు ఫైనల్ వరకు ఇదే జైత్రయాత్రను కొనసాగాలని కోరుకుంటున్నారు. దక్షిణాఫ్రికాతో సెమీస్ గురించి కోచ్ మాట్లాడుతూ... ‘తనదైన రోజున సఫారీలు అద్భుతంగా ఆడతారు. అయితే వాళ్లను ఒత్తిడిలో ఉంచాలి. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి. రెండు జట్లూ మంచి క్రికెట్ ఆడుతున్నాయి.

కాబట్టి హోరాహోరీ పోరు తప్పకపోవచ్చు. ప్రస్తుతం కివీస్ మంచి ఆత్మవిశ్వాసంతో ఉంది. ఇప్పటివరకు నేను చూసిన వాటిల్లో గప్టిల్ ఇన్నింగ్స్ అద్భుతమైనది. అతను ఆడిన తీరు అమోఘం. టైమింగ్, షాట్ల ఎంపిక, పరిస్థితులను అన్వయించుకోవడం సూపర్బ్. బౌల్ట్ కూడా చక్కగా  బౌలింగ్ వేశాడు. ఇక వెటోరి క్యాచ్‌ను వర్ణించలేం. 36 ఏళ్ల వయసులో అతను అంతపైకి ఎగురుతాడని ఊహించలేదు’ అని హెస్సన్ వివరించారు.

Advertisement
Advertisement