మార్పు మంచికే: పటేల్ | Sakshi
Sakshi News home page

మార్పు మంచికే: పటేల్

Published Tue, Aug 19 2014 11:52 PM

మార్పు మంచికే: పటేల్

ముంబై: భారత క్రికెట్ జట్టు టీమ్ డెరైక్టర్‌గా మాజీ ఆల్‌రౌండర్ రవిశాస్త్రి నియామకంతో... ఆటగాళ్లలో క్రీడాస్ఫూర్తి పెరుగుతుందని బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ అన్నారు. కోచింగ్ నిర్మాణంలో ఈ మార్పు భారత క్రికెట్‌కు మంచిదేనని అన్నారు. అయితే ఇంగ్లండ్‌తో గత మూడు టెస్టుల్లో ఎదురైన పరాభవాల నేపథ్యంలో కెప్టెన్ ధోనిని, కోచ్ ఫ్లెచర్‌ను మార్చే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఫ్లెచర్ భవిష్యత్తు గురించి ఇప్పుడే మాట్లాడడం తగదని అన్నారు. ‘బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని కెప్టెన్, కోచ్‌లకు తెలిపాను. వారిద్దరూ దీనికి అంగీకరించారు. ఇప్పుడు టీమ్ రవిశాస్త్రితో ఉంది. ఇక ఇది అతడి బేబీ.

ప్రతీ విషయాన్నీ ఆయనే పర్యవేక్షిస్తారు. ఒకవేళ ఏ విషయంలోనైనా ఆయన నా సహాయం కోరితే సంతోషంగా అంగీకరిస్తాను’ అని పటేల్ అన్నారు. టీమ్ డెరైక్టర్‌గా రవిశాస్త్రి పేరును సంజయ్ పటేలే సూచించారు. అయితే ఈ పదవికి అతడి పేరును మాత్రమే లెక్కలోకి తీసుకున్నారా? అని అడిగిన ప్రశ్నకు అన్ని ప్రత్యామ్నాయాలను పరిగణనలోకి తీసుకున్నామని, జట్టు ప్రయోజనాల కోసం రవిశాస్త్రి దీనికి అంగీకరించడం సంతోషకరమని చెప్పారు. ఈ సవాల్‌ను స్వీకరించి ఫలితం సాధిస్తానని ఆయన చెప్పాడని గుర్తుచేశారు. అయితే శాస్త్రి బాధ్యతల విషయంలో ఆయన నేరుగా స్పందించలేదు. ‘జట్టు అవసరాల రీత్యా ఆయన ఏ పనైనా చేస్తారు. తమ పాత్రల గురించి వారిద్ద(ఫ్లెచర్, శాస్త్రి)రే నిర్ణయించుకుంటారు’ అని అన్నారు.
 
‘తప్పు ఎక్కడుందో చూడాలి’

భారత క్రికెటర్లపై తమకు పూర్తి నమ్మకముందని సంజయ్ పటేల్ విశ్వాసం వ్యక్తం చేశారు. ‘ఇలాంటి సమయంలోనే వారికి మద్దతు అవసరం. తప్పు ఎక్కడ జరిగిందో చూడాలనుకుంటున్నాం. వారికి క్రికెట్ ఆడడం రావడం లేదని అంటున్నారు. కానీ మానసికంగా వారు అప్‌సెట్ అయ్యారు. మానసిక వికాసానికి కూడా మేం ఒకరిని నియమించాలనుకున్నాం. మైదానంలో, వెలుపల కూడా రవిశాస్త్రి అనుభవవాన్ని ఉపయోగించుకోబోతున్నాం. టూర్ ముగిశాక అన్ని అంశాలపై సమీక్ష జరిపి అవసరమనుకుంటే చర్యలు తీసుకుంటాం’ అని పటేల్ వివరించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement