రెండేళ్ల తరువాత వన్డే జట్టులోకి.. | Sakshi
Sakshi News home page

రెండేళ్ల తరువాత వన్డే జట్టులోకి..

Published Tue, Aug 22 2017 11:11 AM

రెండేళ్ల తరువాత వన్డే జట్టులోకి..

ఆంటిగ్వా:సుమారు రెండేళ్ల సుదీర్ఘ విరామం తరువాత డాషింగ్ ఓపెనర్ క్రిస్ గేల్ కు వెస్టిండీస్ వన్డే జట్టులో చోటు దక్కింది. ఇటీవల భారత్ తో్ జరిగిన ట్వంటీ 20  మ్యాచ్ లో ఆడిన గేల్.. విండీస్ తరపున వన్డే ఆడి 29 నెలలు అయ్యింది. 2015 మార్చిలో గేల్ చివరిసారి వన్డే జట్టులో కనిపించాడు. ఆ తరువాత ఇంతకాలానికి గేల్ కు వన్డే జట్టులో స్థానం కల్పించారు. ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ లో భాగంగా గేల్ కు చోటు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు 15 మంది సభ్యులతో కూడిన జట్టును విండీస్ ప్రకటించింది. గేల్ తో పాటు మార్లోన్ శామ్యూల్స్ కు విండీస్ వన్డే జట్టులో చోటు దక్కింది. 2016 అక్టోబర్ లో శామ్యూల్స్ చివరగా వన్డే ఆడాడు.

ఈ ఇద్దరి ఎంపిక జట్టుకు అదనపు బలాన్ని తీసుకొస్తుందని క్రికెట్ వెస్టిండీస్ సెలక్షన్ ప్యానల్ చైర్మన్ కర్టనీ బ్రౌన్ అభిప్రాయపడ్డారు. దాంతోపాటు వీరి అనుభవం యువ క్రికెటర్లకు లాభిస్తుందని బ్రౌన్ పేర్కొన్నారు. అయితే ఆల్ రౌండర్ డ్వేన్ బ్రేవో కు చోటు కల్పించకపోవడానికి అతను పూర్తి ఫిట్ నెస్ తో లేకపోవడమేనని తెలిపారు. వచ్చే ఏడాది బ్రేవో  పునరాగమనం చేసే అవకాశం ఉందన్నారు. గత కొంతకాలంగా విండీస్ క్రికెటర్లకు బోర్డుకు మధ్య కాంట్రాక్ట్ ఫీజుల విషయంలో తీవ్రస్థాయిలో వివాదం నడిచిన సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలో్నే కొంతమంది విండీస్ సినియర్ క్రికెటర్లు జట్టుకు దూరమవుతూ వచ్చారు. అయితే ఈ వివాదం కొంతవరకూ పరిష్కారం కావడంతో మళ్లీ వెటరన్ క్రికెటర్ల ఎంపికపై విండీస్ బోర్డు దృష్టి పెట్టింది.

Advertisement
Advertisement