ఐపీఎల్‌లో విజయవంతమైన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) మళ్లీ బరిలో దిగేందుకు సిద్ధమవుతోంది.
టీనగర్ (చెన్నై): ఐపీఎల్‌లో విజయవంతమైన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) మళ్లీ బరిలో దిగేందుకు సిద్ధమవుతోంది. రెండేళ్ల నిషేధం శుక్రవారం (జూలై 14)తో ముగిసింది. దీంతో చెన్నైతో పాటు రాజస్తాన్ రాయల్స్ పునరాగమనానికి రంగం సిద్ధమైంది. 2013 ఈవెంట్‌లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఈ రెండు జట్లపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. సీఎస్‌కే యాజమాన్యం తమ అధికారిక ట్విట్టర్ పేజీలో తమ పునరాగమన సందర్భాన్ని ఇలా పోస్ట్ చేసింది.
‘సూపర్ మార్నింగ్ లయన్స్! నిరీక్షణ ముగిసింది. ఇక మెరిసేందుకు... మెరిపించేందుకు సమయం వచ్చింది’ అని పేర్కొంటూ ‘సీఎస్‌కే రిటర్న్స్... విజిల్ పొడు’ అని ముక్తాయించింది. సీఎస్‌కే డైరెక్టర్ జార్జ్ జాన్ మాట్లాడుతూ ‘నిషేధం తొలగడంతో మళ్లీ బరిలోకి దిగుతాం. సాధ్యమైనంత వరకు మా స్టార్ ఆటగాళ్లను, సహాయక సిబ్బందిని రీటెయిన్ (అట్టిపెట్టుకోవడం) చేసుకునేందుకు ప్రయత్నిస్తాం’ అని వెల్లడించారు.