స్టోక్స్‌ ఆ పరుగులు వద్దన్నాడట!

Ben Stokes Asked Umpires To Remove Overthrow Runs From England's Total - Sakshi

జేమ్స్‌ అండర్సన్‌ వెల్లడి

లండన్‌: ప్రపంచకప్‌ ఫైనల్లో ఇంగ్లండ్‌ విజయంలో ‘6 పరుగుల ఓవర్‌త్రో’ పాత్ర కూడా ఉంది. గప్టిల్‌ విసిరిన త్రో బెన్‌ స్టోక్స్‌ బ్యాట్‌కు తగిలి బౌండరీ దాటగా అంపైర్‌ ధర్మసేన ఆరు పరుగులు ప్రకటించడం, బ్యాటింగ్‌ కొనసాగించిన స్టోక్స్‌ ఆ తర్వాత మ్యాచ్‌ను ‘టై’ వరకు తీసుకురావడం జరిగాయి. వాస్తవానికి దానికి 5 పరుగులు ఇవ్వాల్సిందని మాజీ అంపైర్లు దీనిపై విమర్శించారు కూడా. అయితే ఇప్పుడు స్టోక్స్‌ టెస్టు జట్టు సహచరుడు, సీనియర్‌ బౌలర్‌ జేమ్స్‌ అండర్సన్‌ కొత్త అంశాన్ని ముందుకు తెచ్చాడు. ఓవర్‌త్రో ద్వారా వచ్చిన 4 అదనపు పరుగులు తమకు వద్దని స్టోక్స్‌ అంపైర్లకు చెప్పినట్లుగా అండర్సన్‌ వెల్లడించాడు. ‘బ్యాట్స్‌మన్‌ పరుగు తీసే సమయంలో త్రో అతనికి తగిలి మైదానంలో బంతి ఎక్కడికైనా వెళితే పరుగు తీయకుండా ఆగిపోవడం క్రికెట్‌లో నైతిక నియమం.

కానీ బంతి బౌండరీ దాటితే ఎవరేమీ చేయలేరు. నాలుగు పరుగులు ఇవ్వాల్సిందే. నిజానికి మ్యాచ్‌ తర్వాత స్టోక్స్‌ అంపైర్‌ వద్దకు వెళ్లి ఆ నాలుగు పరుగులు తీసేయండి. మాకు అవసరం లేదని చెప్పాడు. తాను తప్పు చేసినట్లు కూడా అతను మైకేల్‌ వాన్‌తో అన్నట్లు తెలిసింది. అయితే అదంతా నిబంధనల ప్రకారమే జరిగింది’ అని అండర్సన్‌ మద్దతు పలికాడు. ఓవర్‌ త్రో బౌండరీ చేరగానే తన తప్పేమీ లేదన్నట్లుగా చేతులెత్తి చూపించిన స్టోక్స్‌... దీనిపై విలియమ్సన్‌కు క్షమాపణ చెప్పానని మాత్రం మ్యాచ్‌ తర్వాత వ్యాఖ్యానించాడు. అందులో అంపైర్ల ప్రస్తావన లేదు కాబట్టి అండర్సన్‌ వ్యాఖ్యలో నిజమెంత అనేది సందేహమే!  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top