ఐపీఎల్‌పై రేపు తుది నిర్ణయం!

BCCI suspends IPL till April 15 due to coronavirus - Sakshi

బీసీసీఐ, ఫ్రాంచైజీ ప్రతినిధుల సమావేశం

ముంబై: కరోనా వైరస్‌ కట్టడి కోసం దేశంలోని పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ ప్రకటిస్తుండటం... ఈ మహమ్మారి ఇంకా నియంత్రణలోకి రాకపోవడం... వెరసి ఈ ఏడాది ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) టి20 టోర్నమెంట్‌ జరుగుతుందా లేదా అనే సందేహాలు మరింత ఎక్కువయ్యాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం మార్చి 29న ఐపీఎల్‌–13 సీజన్‌ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే భారత్‌లో కరోనా కేసులు బయటపడటంతో కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో ఐపీఎల్‌ను ఏప్రిల్‌ 15 వరకు వాయిదా వేశారు.

కానీ ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఇంకా తగ్గుముఖం పట్టకపోవడం... అమితాదరణ ఉన్న అన్ని క్రీడాంశాల టోర్నమెంట్స్‌ను వాయిదా వేయడం లేదా రద్దు చేయడం జరిగాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌పై తుది నిర్ణయం తీసుకునేందుకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ), ఫ్రాంచైజీలు మంగళవారం కాన్ఫరెన్స్‌ కాల్‌ ద్వారా సమావేశం కానున్నాయి. ఈ సమావేశంలోనే ఐపీఎల్‌ను మరికొంత కాలం వాయిదా వేయాలా లేక ఈ ఏడాదికి పూర్తిగా రద్దు చేయాలా అనే అంశంపై నిర్ణయం తీసుకుంటారు. బీసీసీఐ కార్యాలయం తాత్కాలికంగా మూసి వేయడం... ఏదైనా హోటల్లోనూ సమావేశం నిర్వహించే అవకాశం లేకపోవడంతో... ఈ సమావేశాన్ని కాన్ఫరెన్స్‌ కాల్‌ ద్వారా నిర్వహిస్తారు.

  కరోనా వైరస్‌ భారత్‌లో అడుగు పెట్టిన తర్వాత కూడా బీసీసీఐ మార్చి 13న ఈసారి ఐపీఎల్‌ను ప్రేక్షకులు లేకుండా నిర్వహిస్తామని ప్రకటించింది. అయితే కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగడంతో తమ నిర్ణయంపై వెనక్కి తగ్గి ఏప్రిల్‌ 15 వరకు ఐపీఎల్‌ను వాయిదా వేస్తున్నామని ప్రకటించింది. అనంతరం ఐపీఎల్‌ను కుదించి నిర్వహించాలని... ఒకవేళ వేసవి కాలంలో సాధ్యంకాకపోతే జూలై–సెప్టెంబర్‌ మధ్య కాలంలో ఏర్పాటు చేసే అంశాన్ని బీసీసీఐ పరిశీలించింది. ఈ ఏడాది అక్టోబరులో ఆస్ట్రేలియాలో టి20 వరల్డ్‌ కప్‌ జరగనున్న నేపథ్యంలో సెప్టెంబర్‌లోపే ఐపీఎల్‌ను నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. పరిస్థితులు అనుకూలించక ఐపీఎల్‌–2020 సీజన్‌ పూర్తిగా రద్దయితే మాత్రం బీసీసీఐ సుమారు రూ. 3500 కోట్లు నష్టపోయే అవకాశముంది.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top