క్రికెటర్లకు ‘డోపింగ్‌’ పరీక్షలు! 

BCCI set to work for six months with National Anti-Doping Agency - Sakshi

 ‘నాడా’తో కలిసి పని చేయనున్న బీసీసీఐ  

ముంబై: ‘డోపింగ్‌ను గుర్తించేందుకు మా సొంత వ్యవస్థ ఉంది, ఆటగాళ్లు ఏ సమయంలో ఎక్కడ ఉన్నారో అడుగుతున్నారు కాబట్టి వేరేవారితో కలిసి పని చేసే ప్రసక్తే లేదు’... ఇప్పటి వరకు భారత క్రికెటర్లకు డోపింగ్‌ విషయంలో బీసీసీఐ వైఖరి ఇది. కానీ ఇప్పుడు అది మారబోతోంది. ఇకపై జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (నాడా)తో కలిసి పని చేసేందుకు సిద్ధమని బీసీసీఐ ప్రకటించింది. అయితే ప్రస్తుతానికి ఇది ఆరు నెలలు మాత్రమేనని... ఫలితాలతో తాము సంతృప్తి చెందితేనే కొనసాగిస్తామని, లేదంటే ఒప్పందాన్ని రద్దు చేస్తామని బోర్డు స్పష్టం చేసింది. ఐసీసీ చైర్మన్‌ శశాంక్‌ మనోహర్‌తో బీసీసీఐ ఆఫీస్‌ బేరర్లు, సీఓఏ సభ్యుల సమావేశం జరిగిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పటి వరకు తమ క్రికెటర్లకు స్వీడన్‌లోని ఐడీటీఎంలో బీసీసీఐ డోపింగ్‌ పరీక్షలు నిర్వహిస్తోంది. బీసీసీఐని తమ పరిధిలోకి తీసుకురావాలని గతంలోనే  ప్రపంచ డోపింగ్‌ నిరోధక సంస్థ (వాడా) ఐసీసీని హెచ్చరించింది. ‘నిబంధనల ప్రకారం కనీసం పది శాతం శాంపుల్స్‌ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి పరీక్షల కోసం మేం ముందుగా వాటిని అందజేస్తాం. ఇందులో భారత క్రికెటర్లతో పాటు దేశవాళీ ఆటగాళ్లు కూడా ఉంటారు’ అని బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు. మరోవైపు ఐపీఎల్‌లో రాజకీయ ప్రకటనలు ప్రసారం చేయరాదంటూ స్టార్‌ స్పోర్ట్స్‌కు బీసీసీఐ స్పష్టతనిచ్చింది.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top