పాకిస్తాన్‌కు ఝలక్‌ ఇచ్చిన బంగ్లా

Bangladesh Asked The Tests Against Pakistan to be Shifted To A Neutral Venue - Sakshi

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ)కు బంగ్లాదేశ్‌ చిన్న ఝలక్‌ ఇచ్చింది. జనవరిలో రెండు టెస్టులు, మూడు టీ20ల కోసం బంగ్లాదేశ్‌ క్రికెట్‌ జట్టు పాక్‌లో పర్యాటించాల్సివుంది. దీనికోసం పీసీబీ అన్ని ఏర్పాట్లను చేసింది. అయితే పాక్‌లో కేవలం టీ20లు మాత్రమే ఆడతామని, టెస్టులు తటస్థ వేదికపై ఆడతామని బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు(బీసీబీ) తేల్చిచెప్పింది.  పాక్‌లో ఎక్కువ రోజులు ఉండటానికి బంగ్లా క్రికెటర్లు విముఖత వ్యక్తం చేయడంతోనే బీసీబీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక ఈ నిర్ణయంతో కంగుతిన్న పాక్‌ క్రికెట్‌ బోర్డు బీసీబీపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇదే క్రమంలో పాక్‌ కెప్టెన్‌ అజహర్‌ అలీ, హెడ్‌కోచ్‌ మిస్బావుల్‌ హక్‌లు కూడా బీసీబీ తీరును తప్పుపడుతున్నారు. 

‘కేవలం టీ20లే ఆడతాం, టెస్టులు ఆడం అనడం అనైతికం.  ప్రస్తుతం పాక్‌లో క్రికెట్‌ పునరజ్జీవం పోసుకోవాలంటే అది టెస్టులతోనే సాధ్యం. వీలైనన్ని ఎక్కువ టెస్టు సిరీస్‌లు నిర్వహించడంతో పాక్‌లో క్రికెట్‌ బతుకుతుంది. దీని కోసమే పీసీబీ అన్ని ప్రయత్నాలను చేస్తోంది. ఈ క్రమంలో టెస్టులు ఆడమని, కేవలం టీ20లో అడతామనడం సరైనదికాదు. ఈ విషయంలో బీసీబీని ఉపేక్షించేదిలేదు. టెస్టులు ఆడకపోతే బంగ్లాపై కఠిన చర్యలు తీసుకోవాలి. వారు కోరినట్లు కేవలం టీ20లు మాత్రమే ఆడే అవకాశం ఇస్తే మిగతా దేశాలు కూడా అదే దారిలో వెళతాయి. దీంతో పాక్‌లో టెస్టు క్రికెట్‌ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుంది. ఇప్పటికే శ్రీలంక టెస్టు సిరీస్‌ ది​గ్విజయంగా ముగిసింది. లంక దారిలోనే మరిన్ని జట్లు పాక్‌లో అడుగుపెట్టాలని ఆకాంక్షిస్తున్నాం’అంటూ మిస్బావుల్‌, అజహర్‌లు పేర్కొన్నారు. 

ఇక బీసీబీ నిర్ణయంతో పాకిస్తాన్‌కు మింగుడుపడటంలేదు. ఈ విషయంపై పీసీబీ చైర్మన్‌ ఎహ్‌సాన్‌ మణి కూడా స్పందించారు. బీసీబీతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. అంతేకాకుండా పాక్‌లో బంగ్లాదేశ్‌ పర్యటన ఉంటుందని, టీ20లతో పాటు టెస్టులు కూడా ఆడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే తటస్థ వేదికల్లో మ్యాచ్‌లు నిర్వహించబోమని మరోసారి స్పష్టం చేశారు. భద్రతాపరమైన ఎలాంటి చిక్కులు లేవని శ్రీలంక సిరీస్‌తో ప్రపంచానికి తెలిసిపోయిందని.. ఈ క్రమంలో పాక్‌లో పర్యటిచడానికి వారి సమస్యేంటో అర్థం కావటం లేదని ఆవేదన వ్య​క్తం చేశారు.

  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top