ఆఖరి క్షణాల్లో ఆశలు ఆవిరి

Bahrain has achieved victory over India - Sakshi

బహ్రెయిన్‌ చేతిలో భారత్‌ పరాజయం

ఆసియా కప్‌ నుంచి నిష్క్రమణ  

షార్జా: మరో నాలుగు నిమిషాలు గడిస్తే... భారత ఫుట్‌బాల్‌ జట్టుకు ఆసియా కప్‌లో నాకౌట్‌ బెర్త్‌ ఖాయమయ్యేది. కానీ ఇంజ్యూరీ సమయంలో ‘డి’ ఏరియాలో ప్రణయ్‌ హల్డర్‌ చేసిన తప్పిదంతో భారత్‌ భారీ మూల్యమే చెల్లించుకుంది. బహ్రెయిన్‌ ప్లేయర్‌ను ప్రణయ్‌ మొరటుగా అడ్డుకోవడంతో రిఫరీ ప్రత్యర్థి జట్టుకు పెనాల్టీ కిక్‌ను ప్రకటించారు. జమాల్‌ రషీద్‌ భారత గోల్‌ కీపర్‌ను బోల్తా కొట్టిస్తూ బంతిని లక్ష్యానికి చేర్చాడు. దాంతో బహ్రెయిన్‌ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇంజ్యూరీ సమయంలోని మిగతా మూడు నిమిషాలు ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్న బహ్రెయిన్‌ తుదకు 1–0తో భారత్‌పై విజయాన్ని ఖాయం చేసుకుంది.

దాంతో గ్రూప్‌ ‘ఎ’ నుంచి ఆతిథ్య యూఏఈ (5 పాయింట్లు), థాయ్‌లాండ్‌ (4 పాయింట్లు), బహ్రెయిన్‌ (4 పాయింట్లు) జట్లు నాకౌట్‌ దశకు అర్హత సాధించాయి. 3 పాయింట్లతో భారత్‌ చివరి స్థానంలో నిలిచి నిష్క్రమించింది. తొలి మ్యాచ్‌లో 4–1తో థాయ్‌లాండ్‌ను ఓడించిన భారత్‌... రెండో మ్యాచ్‌లో 0–2తో యూఏఈ చేతిలో... మూడో మ్యాచ్‌లో 0–1తో బహ్రెయిన్‌ చేతిలో ఓడింది. గ్రూప్‌ ‘ఎ’లో సోమవారమే జరిగిన యూఏఈ–థాయ్‌లాండ్‌ మ్యాచ్‌ 1–1తో ‘డ్రా’ కావడం భారత్‌ నాకౌట్‌ ఆశలను దెబ్బ తీసింది. ఒకవేళ యూఏఈ గెలిచి ఉంటే భారత్‌కు నాకౌట్‌ అవకాశాలు మిగిలి ఉండేవి. ఓటమి తర్వాత భారత కోచ్‌ పదవికి తాను రాజీనామా చేస్తున్నట్లు కాన్‌స్టంటైన్‌ ప్రకటించారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top