రాహుల్‌ యాదవ్‌ ముందంజ

Badminton Telangana player Rahul Yadav entered the third round - Sakshi

గువాహటి: జాతీయ సీనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ పురుషుల సింగిల్స్‌ విభాగంలో తెలంగాణ ప్లేయర్‌ చిట్టబోయిన రాహుల్‌ యాదవ్‌ మూడో రౌండ్‌లోకి ప్రవేశించాడు. తెలంగాణకే చెందిన సిరిల్‌ వర్మ, ఎన్‌వీఎస్‌ విజేత మాత్రం రెండో రౌండ్‌లో నిష్క్రమించారు. తొలి రౌండ్‌లో ‘బై’ పొందిన ఐదో సీడ్‌ రాహుల్‌ యాదవ్‌ రెండో రౌండ్‌లో 21–17, 21–8తో కరణ్‌ చౌదరీ (హిమాచల్‌ప్రదేశ్‌)పై గెలుపొందాడు. తొలి రౌండ్‌లో సిరిల్‌ వర్మ 21–7, 21–13తో మాల్‌స్వామ్‌సంగా (మిజోరం)పై నెగ్గి... రెండో రౌండ్‌లో 21–23, 17–21తో హర్షీల్‌ డాని (మహారాష్ట్ర) చేతిలో ఓడిపోయాడు.

తొలి రౌండ్‌లో విజేత 21–12, 20–22, 21–9తో మయూఖ్‌ ఘోష్‌ (పశ్చిమ బెంగాల్‌)పై గెలిచి... రెండో రౌండ్‌లో 13–21, 21–14, 17–21తో ప్రియాన్షు రజావత్‌ (మధ్యప్రదేశ్‌) చేతిలో ఓటమి  చవిచూశాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జశ్వంత్, జగదీశ్‌ కూడా మూడో రౌండ్‌లోకి ప్రవేశించారు. రెండో రౌండ్‌లో జశ్వంత్‌ 21–18, 17–21, 21–17తో రఘు (కర్ణాటక)పై, జగదీశ్‌ 23–21, 20–22, 21–16తో ధ్రువ్‌ రావత్‌ (ఉత్తరాఖండ్‌)పై గెలిచారు.

మహిళల సింగిల్స్‌ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయిలు గుమ్మడి వృశాలి, కె.ప్రీతి మూడో రౌండ్‌కు చేరగా... పాకలపాటి నిశిత వర్మ రెండో రౌండ్‌లో ఓడిపోయింది. తొలి రౌండ్‌లో ‘బై’ పొందిన వృశాలి... రెండో రౌండ్‌లో 21–11, 21–5తో మైత్రేయి ఖత్రి (గుజరాత్‌)పై గెలిచింది. కె.ప్రీతి తొలి రౌండ్‌లో 21–12, 21–8తో దెబహుటి లహోన్‌ (అస్సాం)పై విజయం సాధించగా... రెండో రౌండ్‌లో ఆమెకు రేవతి దేవస్థలే (ఆలిండియా యూనివర్సిటీస్‌) నుంచి వాకోవర్‌ లభించింది. నిశిత తొలి రౌండ్‌లో 21–17, 21–14తో ఇషారాణి బారువా (అస్సాం)పై గెలిచి... రెండో రౌండ్‌లో 20–22, 10–21తో కవిప్రియ (పాండిచ్చేరి) చేతిలో ఓటమి చవిచూసింది.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top