తప్పుడు నిర్ణయం...  తగిన మూల్యం 

Badminton: India lose to Malaysia 2-3 - Sakshi

పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్‌ బదులు సమీర్‌ను ఆడించిన కోచ్‌లు

అనూహ్యంగా ఓడిన సమీర్‌ వర్మ

చివరి రెండు డబుల్స్‌ మ్యాచ్‌ల్లోనూ పరాజయం

భారత్‌కు షాక్‌ ఇచ్చిన మలేసియా

నానింగ్‌ (చైనా): ప్రత్యర్థి ర్యాంక్‌ ఆధారంగా వారి ప్రతిభను తక్కువ అంచనా వేసి... విజయం సాధిస్తామనే ధీమాతో తప్పుడు నిర్ణయం తీసుకుంటే... తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని భారత బ్యాడ్మింటన్‌ కోచ్‌ల బృందానికి తెలిసొచ్చింది. ప్రపంచ మిక్స్‌డ్‌ టీమ్‌ చాంపియన్‌షిప్‌ సుదిర్మన్‌ కప్‌లో భాగంగా గ్రూప్‌–1‘డి’లో మలేసియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 2–3తో అనూహ్య ఓటమిని ఎదుర్కొంది. పురుషుల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్, ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్‌ కిడాంబి శ్రీకాంత్‌ను కాదని... సమీర్‌ వర్మను ఆడించాలని కోచ్‌లు తీసుకున్న నిర్ణయం ఆశించిన ఫలితం ఇవ్వలేదు. తొలి మ్యాచ్‌గా జరిగిన మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌–అశ్విని పొన్నప్ప 16–21, 21–17, 24–22తో గో సూన్‌ హువాట్‌–లై షెవోన్‌ జెమీ (మలేసియా)లను ఓడించి భారత్‌కు 1–0 ఆధిక్యాన్ని అందించారు. రెండో మ్యాచ్‌గా జరిగిన పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ 13వ ర్యాంకర్‌ సమీర్‌ వర్మ 13–21, 15–21తో ప్రపంచ 20వ ర్యాంకర్‌ లీ జి జియా (మలేసియా) చేతిలో ఓడిపోయాడు. దాంతో స్కోరు 1–1తో సమమైంది. మూడో మ్యాచ్‌గా జరిగిన మహిళల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్‌ పీవీ సింధు 21–12, 21–8తో గో జి వె (మలేసియా)పై నెగ్గడంతో భారత్‌ 2–1తో ఆధిక్యంలోకి వచ్చింది.

నాలుగో మ్యాచ్‌గా జరిగిన పురుషుల డబుల్స్‌లో ప్రపంచ 24వ ర్యాంక్‌ జోడీ సుమీత్‌ రెడ్డి–మను అత్రి 20–22, 19–21తో ప్రపంచ 1394 ర్యాంక్‌ జంట ఆరోన్‌ చియా–తియో ఈ యి (మలేసియా) చేతిలో ఓడిపోయింది. దాంతో స్కోరు 2–2తో సమమైంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 1394వ స్థానంలో ఉన్నప్పటికీ ఆరోన్‌–తియో జోడీ పట్టుదలతో పోరాడి మలేసియాను నిలబెట్టింది. ఇక చివరి మ్యాచ్‌గా జరిగిన మహిళల డబుల్స్‌లో ప్రపంచ 25వ ర్యాంక్‌ ద్వయం సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప 11–21, 19–21తో ప్రపంచ 13వ ర్యాంక్‌ జోడీ చౌ మె కువాన్‌–లీ మెంగ్‌ యీన్‌ (మలేసియా) చేతిలో ఓటమి పాలవ్వడంతో భారత్‌ పరాజయం ఖాయమైంది. ఒకవేళ శ్రీకాంత్‌ను పురుషుల సింగిల్స్‌లో ఆడించి ఉంటే, అతను గెలిచి ఉంటే భారత్‌ విజయం డబుల్స్‌ మ్యాచ్‌లకంటే ముందుగానే 3–0తో ఖాయమయ్యేది. కానీ శ్రీకాంత్‌కంటే సమీర్‌ వర్మపైనే కోచ్‌లు ఎక్కువ నమ్మకం ఉంచారు. కానీ వారి నిర్ణయం బెడిసికొట్టింది. భారత జట్టు క్వార్టర్‌ ఫైనల్‌కు చేరాలంటే పదిసార్లు చాంపియన్‌ చైనాతో నేడు జరిగే మ్యాచ్‌లో భారత్‌ తప్పకుండా గెలవాలి.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top