ఆ చెత్త షాట్‌ ఏంటి.. ఫీల్డ్‌లోనే కెప్టెన్‌ అసహనం

Babar Azam Frustrated Speechless At Teammate Asif Ali - Sakshi

సిడ్నీ:  పాకిస్తాన్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను ఆసీస్‌ 2-0తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. తొలి టీ20కి వర్షం కారణంగా ఫలితం తేలకపోగా, మిగతా రెండు టీ20లను ఆసీస్‌ గెలుచుకుంది. కాగా, రెండో టీ20లో పాకిస్తాన్‌ జట్టు క్లిష్ట పరిస్థితుల్లో పడ్డటప్పుడు అసిఫ్‌ అలీ ఆడిన షాట్‌ పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌కు ఆగ్రహం తెప్పించింది.  12వ ఓవర్‌లో అసిఫ్‌ అలీ స్లాగ్‌ స్వీప్‌ షాట్‌ ఆడగా అది కాస్తా ప్యాట్‌ కమిన్స్‌ చేతుల్లో పడింది. దాంతో చిర్రెత్తుకొచ్చిన అజామ్‌.. ఆ చెత్త షాట్‌ ఏంటి అంటూ అలీపై మండిపడ్డాడు. ఆ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ 22 పరుగులకే రెండు వికెట్లు కోల్పోగా, రిజ్వాన్‌తో కలిసి బాబర్‌ అజామ్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు.

మూడో వికెట్‌కు 31 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన తర్వాత రిజ్వాన్‌ ఔట్‌ అయ్యాడు. ఆ తరుణంలో బ్యాటింగ్‌కు వచ్చిన హార్డ్‌ హిట్టర్‌ అలీ వచ్చీ రావడంతో బ్యాట్‌కు పని చెప్పే యత్నం చేశాడు. అయితే ఐదు బంతులు మాత్రమే ఆడిన అలీ నాలుగు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌ చేరాడు. జట్టు పరిస్థితిని చక్కదిద్దాల్సిన సమయంలో చెత్తగా ఆడటంతో పిచ్‌ మధ్యలోకి వచ్చిన బాబర్‌ అజామ్‌ నియంత్రణ కోల్పోయాడు. ఆ షాట్‌ అవసరం ఉందా అనే అర్థం వచ్చేలా అలీపై కోపాన్ని ప్రదర్శించాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ అయ్యింది.

ఆ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. అజామ్‌ హాఫ్‌ సెంచరీ సాధించాడు. కాగా, పాక్‌ నిర్దేశించిన లక్ష్యాన్ని ఆసీస్‌ 18.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. స్టీవ్‌ స్మిత్‌ కడవరకూ క్రీజ్‌లో ఉండి ఆసీస్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 51 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్సర్‌ అజేయంగా 80 పరుగులు చేశాడు స్మిత్‌.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top