ఇదేనా మీరిచ్చే గౌరవం: ప్రధాని ఆగ్రహం

Australia PM Blasts English Fans For Booing Smith - Sakshi

సిడ్నీ: యాషెస్‌ సిరీస్‌లో ఆస్ట్రేలియా క్రికెటర్‌ స్టీవ్‌ స్మిత్‌ను పదే పదే చీటర్‌-చీటర్‌ అంటూ ఎగతాళి చేయడంపై ఆ దేశ ప్రధాని స్కాట్‌ మారిసన్‌ తీవ్రంగా మండిపడ్డారు. యాషెస్‌ రెండో టెస్టులో గాయపడి రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగిన స్మిత్‌.. 40 నిమిషాల తర్వాత తిరిగి క్రీజ్‌లోకి వస్తుంటే ఇంగ్లిష్‌ అభిమానులు హేళన చేయడాన్ని తప్పుబట్టారు. ఒక క్రికెటర్‌కు ఇదేనా మీరిచ్చే గౌరవం అంటూ మారిసన్‌ ధ్వజమెత్తారు. ‘ మీ చేష్టలు మరి శృతి మించి పోతున్నాయి. తీవ్రంగా గాయపడ్డ క్రికెటర్‌ పోరాట స్ఫూర్తిని ప్రదర్శించడానికి క్రీజ్‌లోకి తిరిగి వస్తుంటే ఎగతాళి చేస్తారా. (ఇక్కడ చదవండి: అదొక భయంకరమైన క్షణం: రూట్‌)

ఒక చాంపియన్‌ క్రికెటర్‌కు ఇదేనా మీరిచ్చే గౌరవం. అతను నిజమైన చాంపియన్‌. విమర్శకులకు స్మిత్‌ బ్యాట్‌తోనే సమాధానం చెబుతాడు. మీరు ఎంతలా హేళన చేస్తే అంతకు మించి అతని బ్యాటే జవాబిస్తుంది. స్మిత్‌.. నువ్వు బ్యాట్‌తో మరింత రాణించి యాషెస్‌ ట్రోఫీని ఆస్ట్రేలియాకు తీసుకువస్తావని ఆశిస్తున్నా’ అని మారిసన్‌ తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో పేర్కొన్నారు.

బాల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడి ఏడాది నిషేధం ఎదుర్కొన్న ఆసీస్‌ క్రికెటర్‌ స్టీవ్‌ స్మిత్‌.. యాషెస్‌ సిరీస్‌ ద్వారా తన టెస్టు పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. తొలి టెస్టులో రెండు భారీ సెంచరీలు చేసిన స్మిత్‌.. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 92 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. అయితే స్మిత్‌కు నిరసనల సెగ తప్పడం లేదు. ఆ బాల్‌ ట్యాంపరింగ్‌ ఉదంతాన్ని గుర్తు చేస్తూ ఇంగ్లండ్‌ అభిమానులు పదే పదే ‘చీటర్‌-చీటర్‌’ ఎగతాళి చేస్తూనే ఉన్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top