‘ఫైనల్‌’ లోటు తీరేనా!

Asian Games 2018: India record in Asia's biggest multi-sport event - Sakshi

ఆసియా క్రీడల్లో భారత్‌కు అందని ద్రాక్షగా స్వర్ణ, రజతాలు మహిళల సింగిల్స్‌లో సింధు,  సైనాపై భారీ అంచనాలు

నాడు ప్రకాశ్‌ పదుకొనె, సయ్యద్‌ మోదీ, పుల్లెల గోపీచంద్‌ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నపుడుగానీ... నేడు పీవీ సింధు, సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్‌ జోరులో ఉన్న పుడుగానీ... భారత బ్యాడ్మింటన్‌కు మాత్రం ఆసియా క్రీడలు అంతగా కలిసి రాలేదు. ప్రపంచ బ్యాడ్మింటన్‌ను శాసించేది ఆసియా దేశాలే కావడం... చైనా, కొరియా, జపాన్, దక్షిణ కొరియా, ఇండోనేసియా, మలేసియా జట్లు పటిష్టంగా ఉండటం... ఈ నేపథ్యంలో 1962 జకార్తా ఆసియా క్రీడల్లో తొలిసారి బ్యాడ్మింటన్‌ను చేర్చినప్పటి నుంచి ఇప్పటిదాకా భారత క్రీడాకారులెవరూ ఈ మెగా ఈవెంట్‌లో ఫైనల్‌కు చేరుకోలేకపోయారు. ఇప్పటివరకు మనోళ్ల అత్యుత్తమ ప్రదర్శన కాంస్యమే కావడం గమనార్హం. అయితే అన్నీ కలిసొస్తే... సింధు, సైనా, శ్రీకాంత్‌ చెలరే గితే... ఈసారి భారత్‌ ‘ఫైనల్‌’ లోటును తీర్చుకోవడంతోపాటు స్వర్ణ, రజత కాంతులు విరజిమ్మే అవకాశాలు కనిపిస్తున్నాయి.   

సాక్షి క్రీడావిభాగం: ఒలింపిక్స్‌... ప్రపంచ చాంపియన్‌షిప్‌... ఆసియా చాంపియన్‌షిప్‌... కామన్వెల్త్‌ గేమ్స్‌... ఇలా అత్యున్నత వేదికలపై భారత బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు తమ సత్తాను చాటుకొని ఫైనల్‌కు చేరుకున్నారు. కాంస్యాలే కాకుండా రజత, స్వర్ణ పతకాలనూ సాధించారు. కానీ ఆసియా క్రీడల్లో మాత్రం రజత, స్వర్ణాలు ఇంకా ఊరిస్తూనే ఉన్నాయి. మరో ఐదు రోజుల్లో ప్రారంభం కానున్న 2018 జకార్తా ఆసియా క్రీడల్లో బ్యాడ్మింటన్‌ ఈవెంట్‌ పోటీలు ఆగస్టు 19 నుంచి 28 వరకు జరుగుతాయి. 

నిలకడైన ప్రదర్శన... 
గత ఆరేళ్ల కాలంలో భారత బ్యాడ్మింటన్‌ గణనీయమైన పురోగతి సాధించింది. ప్రపంచ బ్యాడ్మింటన్‌లో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. సింగిల్స్‌లో సైనా,  పీవీ సింధు, శ్రీకాంత్, సాయిప్రణీత్, ప్రణయ్‌... డబుల్స్‌లో సాత్విక్‌–చిరాగ్‌ శెట్టి, సుమీత్‌ రెడ్డి–మనూ అత్రి, సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప, సిక్కి రెడ్డి–ప్రణవ్‌ జంటలు గొప్ప విజయాలు సాధించాయి. మహిళల సింగిల్స్‌లో సైనా... పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్‌ ప్రపంచ నంబర్‌వన్‌గా కూడా నిలిచారు. గత ఐదు ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో మహిళల సింగిల్స్‌లో అత్యధికంగా ఆరు పతకాలు భారత క్రీడాకారిణులు సింధు, సైనాలే గెలవడం మరో విశేషం. 

ఆ ఇద్దరిపైనే ఆశలు
ఐదున్నర దశాబ్దాల చరిత్ర కలిగిన ఆసియా క్రీడల బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ విభాగంలో ఒక్క పతకమూ రాలేదు. అయితే ఈసారి ఆ లోటు తీరేలా కనిపిస్తోంది. భారత స్టార్స్‌ సింధు, సైనా అద్భుతమైన ఫామ్‌లో ఉండటమే దీనికి కారణం. ఇటీవలే ముగిసిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సింధు ఫైనల్‌కు... సైనా క్వార్టర్‌ ఫైనల్‌కు చేరారు. 2014 ఇంచియోన్‌ ఆసియా క్రీడల్లో పీవీ సింధు రెండో రౌండ్‌లో నిష్క్రమించగా... సైనా క్వార్టర్‌ ఫైనల్లో ఓడిపోయింది. అయితే ఈ నాలుగేళ్ల కాలంలో సింధు, సైనా ఆటతీరులో ఎంతో మార్పు వచ్చింది. చైనా, జపాన్, కొరియా, థాయ్‌లాండ్‌ క్రీడాకారిణులకు దీటుగా వీరిద్దరు విజయాలు సాధించారు.  ఇక పురుషుల సింగిల్స్‌ విభాగంలో భారత్‌కు లభించిన ఏకైక కాంస్యం 1982లో సయ్యద్‌ మోదీ సాధించాడు. ఆ తర్వాత మనం ఆ దరిదాపుల్లోకి కూడా వెళ్లలేదు. ఈసారి మాత్రం కాస్త ‘డ్రా’ అనుకూలంగా ఉండి.. శ్రీకాంత్, ప్రణయ్‌ తమ అత్యుత్తమ ప్రదర్శన చేస్తే కనీసం కాంస్యం వచ్చే అవకాశం ఉంది.   

భారత జట్లు 
పురుషుల విభాగం:  శ్రీకాంత్, ప్రణయ్, సాయిప్రణీత్, సమీర్‌ వర్మ, సౌరభ్‌ వర్మ, సాత్విక్‌ సాయిరాజ్, చిరాగ్‌ శెట్టి, 
మనూ అత్రి, సుమీత్‌ రెడ్డి, ప్రణవ్‌ చోప్రా. 
మహిళల విభాగం:  సింధు, సైనా, సిక్కి రెడ్డి, అశ్విని పొన్నప్ప, సాయి ఉత్తేజిత, అష్మిత, రితూపర్ణ, ఆరతి, ఆకర్షి కశ్యప్, పుల్లెల గాయత్రి.  

ఆసియా క్రీడల్లో మన ప్రదర్శన 
టెహ్రాన్, 1974: ప్రకాశ్‌ పదుకొనె, దినేశ్‌ ఖన్నా, దవిందర్‌ అహూజా, పార్థో గంగూలీ, రామన్‌ ఘోష్‌లతో కూడిన భారత పురుషుల జట్టు టీమ్‌ ఈవెంట్‌లో కాంస్యం సాధించింది. 

న్యూఢిల్లీ, 1982: స్వదేశంలో జరిగిన ఈ క్రీడల్లో భారత్‌ ఐదు కాంస్యాలు సాధించింది. పురుషుల సింగిల్స్‌లో సయ్యద్‌ మోదీ... పురుషుల డబుల్స్‌లో లెరాయ్‌ డిసౌజా–ప్రదీప్‌ గాంధె ద్వయం... లెరాయ్‌–కన్వల్‌ ఠక్కర్‌ కౌర్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో... సయ్యద్‌ మోదీ, ఉదయ్‌ పవార్, విక్రమ్‌ సింగ్, లెరాయ్‌ డిసౌజా, ప్రదీప్‌ గాంధె, పార్థో గంగూలీలతో కూడిన పురుషుల జట్టు ... అమీ ఘియా, అమిత, మధుమిత, కన్వల్‌ ఠక్కర్‌ కౌర్, హఫ్రిష్‌ నారీమన్, వందనలతో కూడిన మహిళల జట్టు టీమ్‌ ఈవెంట్‌లో కాంస్యాలు గెలిచాయి.  

సియోల్, 1986: ప్రకాశ్‌ పదుకొనె, సయ్యద్‌ మోదీ, విమల్, సనత్‌ మిశ్రా, లెరాయ్‌ డిసౌజా, ఉదయ్, రవిలతో కూడిన పురుషుల జట్టు టీమ్‌ ఈవెంట్‌లో కాంస్యం దక్కించుకుంది.  
ఇంచియోన్, 2014: సింధు, సైనా, తులసీ, తన్వీ, అశ్విని, ప్రద్న్యా, సిక్కి రెడ్డిలతో కూడిన మహిళల జట్టు టీమ్‌ ఈవెంట్‌లో కాంస్యం సంపాదించింది.  

మేము పతకాలతో తిరిగొస్తామన్న నమ్మకం ఉంది. సింగిల్స్, డబుల్స్, మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఇలా ప్రతి విభాగంలో భారత్‌కు పతకం వచ్చే అవకాశం ఉంది. గతంలో ఈ తరహా ఆశావహ పరిస్థితులు ఎప్పుడూ లేవు. గత ఆసియా క్రీడల్లో భారత మహిళల జట్టు కాంస్యం సాధించింది. ఇటీవల ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సింధు రజతం గెలిచింది. ఈ మెగా ఈవెంట్‌కు ఆటగాళ్లందరి సన్నా హాలు బాగున్నాయి.  
  – గోపీచంద్, చీఫ్‌ కోచ్‌   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top