ధోని బలిదాన్‌ గ్లోవ్స్‌పై ఆర్మీ ఏమన్నదంటే!

Army Says Wear Balidan Gloves or Not Upto MS Dhoni Decide - Sakshi

న్యూఢిల్లీ : టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌, మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని పారా కమెండోల ప్రత్యేక దళానికి చెందిన ‘బలిదాన్‌ బ్యాడ్జ్‌తో బరిలోకి దిగడం తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) ఆగ్రహం వ్యక్తం చేయగా.. భారత అభిమానులు మాత్రం ధోనికి మద్దతుగా నిలుస్తున్నారు. దక్షిణాఫ్రికాతో జరిగిన ప్రపంచకప్‌ ఆరంభపు మ్యాచ్‌లో ఫెలుక్‌వాయోను స్టంపౌట్‌ చేయడం ద్వారా ఈ గ్లౌజ్‌పై ఉన్న లోగో అందరికంటా పడింది. బీసీసీఐ కూడా ధోనికి మద్దతుగా ఆ బ్యాడ్జ్‌ను అనుమతించాలని ఐసీసీని విజ్ఙప్తి చేసింది. అయినా ఐసీసీ బలిదాన్‌ బ్యాడ్జ్‌పై అభ్యంతరం వ్యక్తం చేసింది. అభిమానులు మాత్రం అవసరమైతే ప్రపంచకప్‌ను బహిష్కరిద్దాం కానీ ఆ లోగోను మాత్రం ధోని తీయవద్దంటూ కామెంట్‌ చేస్తున్నారు. ఈ గ్లోవ్స్‌ వ్యవహారంపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ సైతం ధోనికి మద్దతుగా నిలిచారు. ‘హీరోలకు దక్కిన గౌరవం అది.. కొనసాగించూ’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. కానీ మరో వర్గం ఈవ్యవహారాన్ని తప్పుబట్టింది. ‘అది క్రీడా మైదానం.. యుద్దం మైదానం కాదని, అక్కడ అలాంటి లోగోలను ఉపయోగించవద్దని అభిప్రాయపడింది. టీమిండియా దిగ్గజ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌, ప్రముఖ జర్నలిస్టు శేఖర్‌ గుప్తాలు ధోని చర్యను తప్పుబట్టారు. (చదవండి: అసలు సిసలు సమరం)

ఇంత వేడిని పుట్టించిన ఈ వ్యవహారంపై భారత ఆర్మీ స్పందించింది. బలిదాన్‌ బ్యాడ్జ్‌ వాడటం, వాడకపోవడం పూర్తిగా ధోని ఇష్టమని, ఆర్మీకి ఎలాంటి అభ్యంతరం లేదని లెఫ్టనెంట్‌ జనరల్‌ చెరిష్‌ మ్యాథ్‌సన్‌ స్పష్టం చేశారు. అది పూర్తిగా ధోని వ్యక్తిగతమని, ఆ బ్యాడ్జ్‌ వాడొచ్చా లేదా అనేది వాళ్ల క్రికెట్‌ బాడీ నిర్ణయిస్తుందని ఆయన పీటీఐకి తెలిపారు. బీసీసీఐ మాత్రం ఆ లోగో పారా కమెండోల ప్రత్యేక దళాన్ని ప్రతిబించించడం లేదని, ధోని గ్లౌవ్స్‌ అని మాత్రమే తెలియజేస్తుందని వాదిస్తోంది. ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌లో ధోని అవే గ్లౌవ్స్‌తో బరిలోకి దిగుతాడని, కానీ ఆ లోగో దగ్గర కనిపించకుండా టేప్‌ వేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top