కోహ్లి నన్ను గర్వపడేలా చేశాడు: అనుష్క శర్మ

Anushka Sharma Says Virat Kohli Made Her Proud For Many Reasons - Sakshi

ముంబై : ప్రతీ విషయంలోనూ తన భర్త తనను గర్వపడేలా చేస్తాడని బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌, టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సతీమణి అనుష్క శర్మ అన్నారు. వర్ధమాన క్రీడాకారులను కోహ్లి ప్రోత్సహించడం తనకు గర్వకారణమని పేర్కొన్నారు.  ముంబైలో జరిగిన ఇండియన్‌ స్పోర్ట్స్ హానర్స్‌-2019 అవార్డుల కార్యక్రమానికి తన భర్త కోహ్లితో కలిసి అనుష్క శర్మ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ..‘ నా భర్త ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయిన కారణంగానే నేను కూడా ప్రస్తుతం ఇక్కడ ఉన్నాను. నాకు తెలిసి ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్న అథ్లెట్లను ప్రోత్సహిస్తూ కెరీర్‌లో వారు ఎదిగేందుకు తోడ్పడుతున్న ఏకైక కార్యక్రమం ఇదే అనుకుంటా. ఎన్నో విషయాల్లో కోహ్లి నన్ను గర్వపడేలా చేశాడు. ఇక కోహ్లి ఫౌండేషన్‌ అందులోని ఓ ప్రత్యేక అంశం. అన్ని విభాగాలకు చెందిన క్రీడాకారులను గౌరవించే ఈ కార్యక్రమం భారత్‌లో క్రీడా సంస్కృతిని పెంపొందించడంలో తనవంతు పోషిస్తుంది’ అని పేర్కొన్నారు.

కాగా వర్ధమాన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు పారిశ్రామిక దిగ్గజం ఆర్పీ- సంజీవ్‌ గోయెంకా గ్రూప్‌, విరాట్‌ కోహ్లి ఫౌండేషన్‌ 2017లో ఇండియన్‌ స్పోర్ట్స్ హానర్స్‌ అవార్డుల కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. దాదాపు 11 కేటగిరీలకు చెందిన క్రీడాకారులను విజేతగా ఎంపిక చేసి వారికి అవార్డులు ప్రదానం చేస్తారు. ఈ అవార్డుల కార్యక్రమానికి సంజీవ్‌ గోయెంకా, పుల్లెల గోపీచంద్‌, అభినవ్‌ బింద్రా, సర్దార్‌ సింగ్‌, మహేశ్‌ భూపతి, పీటీ ఉష, అంజలి భగవత్‌ తదితరులు జ్యూరీ మెంబర్లుగా వ్యవహరిస్తారు. ఈ క్రమంలో శుక్రవారం ఈ కార్యక్రమం ముంబైలో అట్టహాసంగా జరిగింది. ఈ సందర్బంగా కోహ్లి మాట్లాడుతూ...‘ భారతదేశంలో ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీయాల్సిన అవసరం ఉంది. ఈ అవార్డుల కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు నాకెంతో ఆనందంగా ఉంది. వర్ధమాన క్రీడాకారులకు ప్రోత్సాహకంగా ఉపకార వేతనాలు కూడా అందిస్తున్నాం. తద్వారా భారత్‌లో క్రీడా సంస్కృతికి బాటలు వేసే అవకాశం ఉంటుంది అని పేర్కొన్నాడు. ఇక ఈ కార్యక్రమానికి సానియా మీర్జా, అజింక్య రహానే, జహీర్‌ ఖాన్‌, యువరాజ్‌ సింగ్, స్మృతి మంధాన, బజరంగ్‌ పునియా, నీరజ్‌ చోప్రా తదితర క్రీడాకారులు హాజరయ్యారు.

ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top