ఆటకు రాయుడు గుడ్‌బై

Ambati Rayudu Announces Retirement From All Forms of Cricket - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అంతర్జాతీయ క్రికెట్‌కు టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌ అంబటి తిరుపతి రాయుడు వీడ్కోలు పలికాడు.  ఐపీఎల్‌ సహా అన్ని ఫార్మాట్లకూ వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. ప్రపంచకప్‌లో చోటు ఖాయమని చివరకు ఊరించిన అవకాశం కాస్త విజయ్‌ శంకర్‌ రూపంలో తన్నుకుపోవడంతో ఈ హైదరాబాదీ క్రికెటర్‌ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. స్టాండ్‌బై ఆటగాడిగా ఉన్న కూడా ప్రపంచకప్‌లో చోటు దక్కకపోవడంతో రాయుడు కెరీర్‌ ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలోనే బుధవారం అన్ని ఫార్మాట్ల క్రికెట్‌ కెరీర్‌కు రాయుడు స్వస్తి పలుకుతున్నట్లు తెలుస్తోంది.

కొంపముంచిన ‘3డీ’
రాయుడు కంటే విజయ్‌ శంకరే మూడు రకాలుగా ఉపయోగపడతాడన్న చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ వివరణపై రాయుడు వ్యంగ్యంగా స్పందించాడు. మూడు రకాలుగా (త్రీ డైమెన్షన్స్‌) అన్నందుకు ప్రపంచకప్‌ చూసేందుకు త్రీడి కళ్లద్దాలు ఆర్డర్‌ ఇచ్చానని రాయుడు ట్విట్టర్‌లో పోస్ట్‌ చేయడం చర్చనీయాంశమైంది. అయితే ఈ దురుసుతనమే రాయుడు కల నెరవేరకుండా చేసింది. జట్టులో నాలుగో స్థానానికి ఎంపికైన విజయ్‌ శంకర్‌ గాయం నుంచి తప్పుకున్నా... అదే స్థానానికి చివరి వరకు పోటీ పడిన రాయుడుకు మాత్రం మరోసారి మొండిచేయి ఎదురైంది. ప్రపంచ కప్‌ స్టాండ్‌ బై ఆటగాళ్లలో అతని పేరు ఉన్నా, అసలు సమయానికి మాత్రం ఆ చాన్స్‌ మయాంక్‌ ఎగరేసుకుపోయాడు. పునరాగమనం తర్వాత నిలకడైన ప్రదర్శనతో ‘4’కు సరైనవాడు అని కోహ్లితో ప్రశంసలు పొందినా...న్యూజిలాండ్‌ గడ్డపై భారత టాప్‌ స్కోరర్‌గా నిలిచినా దురదృష్టవశాత్తూ రాయుడును సెలక్టర్లు గుర్తించలేదు. దీంతొ తీవ్రమనస్థాపానికి గురైన రాయుడు తన ఆటకు వీడ్కోలు పలికాడు.

55 వన్డేలాడిన ఈ హైదరాబాదీ బ్యాట్స్‌మన్‌ 47.05 సగటుతో 1694 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 10 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్‌ 124. ఇ‍క తన 17 ఏళ్ల ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 16 సెంచరీలు, 34 హాఫ్‌ సెంచరీలతో 6151 పరుగులు చేశాడు. లిస్ట్‌-ఏలో 160 మ్యాచులాడి 5,103 పరుగులు చేశాడు. టీ20ల్లో 1 సెంచరీ, 24 హాఫ్‌ సెంచరీలతో 4,626 పరుగులు సాధించాడు. ప్రపంచకప్‌ సన్నాహకంలో భాగంగా ఎంపికైన రాయుడు పరిమిత ఓవర్లపై మరింత శ్రద్ధ పెట్టడం కోసమం ఫస్ట్‌ క్లాస్‌క్రికెట్‌కు కూడా గుడ్‌బై చెప్పాడు. ఆసీస్, కివీస్‌ పర్యటనల్లో 82.25 స్ట్రయిక్‌రేట్‌తో రాణించాడు. అయినా రాయుడికి అవకాశం దక్కలేదు.

ఐపీఎలే చివరిది..
2013 జులై 24న టీమిండియా-జింబాబ్వే మధ్య జరిగిన వన్డేల్లో అరంగేట్రం చేసిన రాయుడు.. చివరగా ఈ ఏడాది మార్చిలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో ఆడాడు. 2014లో తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ ఆడాడు. 2016లో జింబాబ్వేతో జరిగిన టీ20నే అతడికి ఆఖరిది. ఈ ఏడాది మార్చిలో ముంబయి ఇండియన్స్‌తో జరిగిన ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున చివరిసారిగా ఆడాడు.

ఐస్‌ లాండ్‌ క్రికెట్‌ ఆహ్వానం..
ప్రపంచకప్‌లో చోటు దక్కలేదనే బాధలో ఉన్న అంబటి రాయుడ్ని తమ దేశానికి వచ్చేయమంటూ.. ఐస్‌లాండ్ నుంచి ఆహ్వానం అందింది. ‘రాయుడు 3డీ గ్లాసెస్‌ను ఇప్పుడైనా పక్కనబెట్టు. మామూలు అద్దాలతో డాక్యుమెంట్లను చదువు. వచ్చి మాతో చేరు. రాయుడంటే మాకెంతో ఇష్టం’ అని ఐస్‌లాండ్ క్రికెట్ ట్వీట్ చేసింది. ఐస్‌లాండ్‌లో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవడం కోసం సమర్పించాల్సిన డాక్యుమెంట్ల వివరాలను కూడా ఐస్‌లాండ్ క్రికెట్ మంగళవారం ట్వీట్ చేసింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top