భారత్‌ సాయం కోరిన అక్తర్‌

Akhtar Requests India To Provide Ventilators For Struggling Pakistan - Sakshi

మీ సహాయం ఎప్పటికీ గుర్తుంచుకుంటాం..

కరాచీ: తమ దేశంలో కరోనా వైరస్‌ను నియంత్రించడానికి భారత్‌ సాయం చేయాలంటూ పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌, రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌గా సుపరిచితమైన షోయబ్‌ అక్తర్‌ విన్నవించాడు. ప్రస్తుతం పాకిస్తాన్‌ విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటుందని, కరోనా వైరస్‌ బారిన పడిన బాధితులకు చికిత్స అందించేందుకు తగినన్ని వెంటిలేటర్లు కూడా లేవన్నాడు. ఈ విషయంలో తమను భారత్‌ ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు. ‘మాకు ప్రస్తుతం 10వేలకు పైగా వెంటిలేటర్లు అవసరం. వెంటిలేటర్లు లేక మా దేశం మరణాల రేటు ఎక్కువగా ఉంది. ఈ విషయంలో సాయం చేయడానికి భారత్‌ ముందుకు రావాలి. ఇరు దేశాల మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి మానవతా కోణంలో మాకు సాయం చేయండి. మిగతా వైద్యపరమైన మౌలిక సదుపాయాల విషయంలో భారత్‌ చొరవచూపాలి. ఈ విషయంలో ఇరు దేశాలు ఏకం కావాలి’ అని అక్తర్‌ కోరాడు. ఇప్పటివరకూ పాకిస్తాన్‌లో 4,263 మందికి కరోనా పాజిటివ్‌ రాగా, అందులో సుమారు 60 మంది మృత్యువాత పడ్డారు. గత 24 గంటల్లోనే నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

ఇరు దేశాల మధ్య సిరీస్‌ జరపండి..
అదే సమయంలో భారత్‌-పాకిస్తాన్‌ల మధ్య వన్డే సిరీస్‌  జరపాలను ప్రతిపాదనను కూడా అక్తర్‌ తీసుకొచ్చాడు. ప్రస్తుతం భారత్‌తో పాటు పాకిస్తాన్‌లోనూ కరోనా ప్రభావం తీవ్ర స్థాయిలో ఉందని, దాంతో ఇరు దేశాలు  మూడు వన్డేల సిరీస్‌ ఆడితే విరాళాలు సేకరించవచ్చన్నాడు. ఈ విరాళాలు ఇరు దేశాలు కరోనాపై చేస్తున్న పోరాటంలో ఉపయోగపడతాయని అక్తర్‌ అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్‌లను ప్రేక్షకుల్ని అనుమతించకుండా టీవీల్లో వీక్షించే విధంగానే పరిమితం చేయాలన్నాడు. తటస్థ వేదికగా దుబాయ్‌ను అక్తర్‌ సూచించాడు. 2007 తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఎటువంటి ద్వైపాక్షిక క్రికెట్‌ సిరీస్ జరుగలేదు. ఐసీసీ నిర్వహించే ఈవెంట్లలో, ఆసియా కప్‌లో మాత్రమే ఇరు దేశాలు తలపడుతున్నాయి. (మహ్మద్‌ కైఫ్‌కు షోయబ్‌ అక్తర్‌ సవాల్‌)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top