క్రికెట్‌కు నమో నమః

After 117 Days First International Match Between England And West Indies - Sakshi

మళ్లీ మొదలవుతున్నక్రికెట్ సందడి

నేటి నుంచి ఇంగ్లాండ్,వెస్టిండీస్ తొలి టెస్టు

కరోనా విరామం తర్వాత జరుగుతున్న మొదటి అంతర్జాతీయ మ్యాచ్

సరిగ్గా 116 రోజుల చదివింపుల తర్వాత సగటు క్రికెట్‌ అభిమానికి కూసింత ఆనందం. ఏ దేశం ఆడితేనేమి... జట్టులో ఎవరుంటేనేమి... కాస్త క్రికెట్‌ ప్రత్యక్ష ప్రసారం గురించి మాట్లాడుకునే అవకాశం... స్కోరు ఏమిటో తెలుసుకోవాలనే ఆసక్తి... ఇన్ని రోజులూ పాత చద్ది వార్తలే చదువుతూ, నాటి ఘనతల గురించే వింటూ వచ్చిన వారికి ఇదో ఊరట. ఎప్పుడో నమిలి మింగేసిన స్కోర్లనే గుర్తుకు తెచ్చుకుంటూ ఇంత కాలం గడిపిన వారికి ఇన్నాళ్లకు క్రికెట్‌ను ఆసక్తిగా చూసే అవకాశం వచ్చేసింది. 

అవును... అంతర్జాతీయ క్రికెట్‌ తిరిగొచ్చింది. కోవిడ్‌–19 కష్టకాలం తర్వాత తొలిసారి ఆటకు రంగం సిద్ధమైంది. ఇందుకు ఇంగ్లండ్‌ చొరవ చూపించగా... అతిథిగా వచ్చేందుకు వెస్టిండీస్‌ అంగీకారం తెలిపింది. ఫలితంగా చరిత్రలో ప్రత్యేకంగా మిగిలిపోయే మ్యాచ్‌కు ఆమోద ముద్ర పడింది. మైదానంలో టచింగ్‌లు లేవు. ఉమ్మితో బంతిని రుద్దటాలు కనిపించవు. అడుగేస్తే సోషల్‌ డిస్టెన్సింగ్, దగ్గరికొస్తే శానిటైజింగ్‌... ఇలా కరోనా కట్టుబాట్లతో క్రికెట్‌ మొదలవుతోంది. 143 ఏళ్ల టెస్టు చరిత్రలో తొలిసారి ఇలాంటి పరిస్థితుల్లో ఆట జరుగుతోంది. టెస్టు క్రికెట్‌ అంటే పడిచచ్చే ఇంగ్లండ్‌లో ప్రేక్షకులు లేకుండా జరిగే ఈ మ్యాచ్‌తో నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉంటుందో ఆటగాళ్లకు అనుభవంలోకి రానుంది.

సౌతాంప్టన్‌: కరోనా విరామం తర్వాత అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంతర్జాతీయ క్రికెట్‌కు సమయం ఆసన్నమైంది. నేటి నుంచి ఇక్కడి రోజ్‌బౌల్‌ మైదానంలో జరిగే తొలి టెస్టులో ఇంగ్లండ్‌తో వెస్టిండీస్‌ తలపడనుంది. సొంతగడ్డపై రికార్డు, ప్రస్తుత బలబలాలు... ఎలా చూసుకున్నా విండీస్‌కంటే ఇంగ్లండ్‌దే అన్నింటా పైచేయి. అయితే ఈ మ్యాచ్‌లో ఆటగాళ్ల ప్రదర్శనకంటే ఆట జరగడంపైనే అందరి దృష్టీ నిలవనుంది. కరోనా వైరస్‌ విజృంభణకు ముందు మార్చి 13న సిడ్నీలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ మధ్య చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ (వన్డే) జరిగింది.

ఇంగ్లండ్‌ బలంగా... 
ఇంగ్లండ్‌ జట్టు జనవరిలో దక్షిణాఫ్రికాతో జొహన్నెస్‌బర్గ్‌లో టెస్టు మ్యాచ్‌ ఆడింది. ఆ సిరీస్‌ను ఇంగ్లండ్‌ 3–1తో గెలుచుకుంది. ఇందులో ఆడిన వారిపైనే నమ్మకముంచిన బోర్డు 13 మందితో జట్టును ప్రకటించింది. వ్యక్తిగత కారణాలతో రెగ్యులర్‌ కెప్టెన్‌ జో రూట్‌ ఈ టెస్టుకు దూరం కాగా... తొలిసారి బెన్‌ స్టోక్స్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. రూట్‌ స్థానంలో రోరీ బర్న్స్‌ తుది జట్టులోకి రావడం మినహా మరో మార్పునకు అవకాశం లేదు. అయితే బర్న్స్‌ ఓపెనర్‌గా ఆడితే క్రాలీ నాలుగో స్థానంలో బరిలోకి దిగుతాడు. మిడిలార్డర్‌లో ఓలీ పాప్, జోస్‌ బట్లర్‌ రూపంలో ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ పటిష్టంగా ఉంది. స్టోక్స్, స్యామ్‌ కరన్‌వంటి ఆల్‌రౌండర్లతో జట్టు బలం మరింత పెరిగింది. అత్యంత అనుభవజ్ఞులైన ఇంగ్లండ్‌ స్టార్‌ బౌలర్లు అండర్సన్, స్టువర్ట్‌ బ్రాడ్‌ చెలరేగితే విండీస్‌కు కష్టాలు తప్పవు. మూడో పేసర్‌గా జోఫ్రా ఆర్చర్‌కే ఎక్కువ అవకాశం ఉన్నా... వుడ్‌ నుంచి అతనికి పోటీ ఎదురవుతోంది. మొత్తంగా స్వదేశంలో ఇంగ్లండ్‌ అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది.
విండీస్‌ నిలిచేనా...
వెస్టిండీస్‌ తమ చివరి టెస్టు మ్యాచ్‌ను గత ఏడాది డిసెంబరులో అఫ్గానిస్తాన్‌తో ఆడింది. అయితే భారత్‌తో పోలిస్తే ఇంగ్లండ్‌ పిచ్‌లు పూర్తిగా భిన్నం కాబట్టి ఇప్పటి తుది జట్టులో మార్పులు తప్పకపోవచ్చు. ఓపెనర్లుగా క్రెయిగ్‌ బ్రాత్‌వైట్, క్యాంప్‌బెల్‌ జోడీకి మంచి రికార్డే ఉంది. ఆ తర్వాత షై హోప్, బ్రూక్స్‌ జట్టు బ్యాటింగ్‌ భారాన్ని మోస్తారు. అఫ్గాన్‌ జట్టుపై సెంచరీతో బ్రూక్స్‌ తనలోని ప్రతిభను ప్రదర్శించాడు. దూకుడుగా ఆడే హెట్‌మైర్‌ ఈ సిరీస్‌కు దూరంగా ఉండనుండటంతో విండీస్‌ బ్యాటింగ్‌ కొంత బలహీనపడింది. అతని స్థానంలో బ్లాక్‌వుడ్‌కు అవకాశం ఇస్తారా చూడాలి. అలా అయితే ముగ్గురు రెగ్యులర్‌ పేసర్లకు చోటు కల్పించడం కష్టం. ఆల్‌రౌండర్లు హోల్డర్, ఛేజ్‌ జట్టుకు మంచి స్కోరు అందించగలరు. ఆఫ్‌స్పిన్నర్‌గా కార్న్‌వాల్‌కు చోటు ఖాయం. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌కు విండీస్‌ ఎంత వరకు పోటీనిస్తుందనేది ఆసక్తికరం.

మ్యాచ్‌ తుది ఫలితం ఎలా ఉన్నా ‘బయో సెక్యూర్‌ బబుల్‌’లో ఈ జరగనున్న ఈ మ్యాచ్‌కు ఎలాంటి అవాంతరాలు రాకూడదని క్రికెట్‌ ప్రపంచం కోరుకుంటోంది. ‘బబుల్‌’ మధ్యలో బద్దలు కాకుండా సిరీస్‌ విజయవంతంగా ముగిసి ఈ ప్రయత్నం మరిన్ని టోర్నీలకు దారి చూపాలని ఆశిస్తోంది. ఇక యూ ట్యూబ్‌ పాత వీడియోలు, ఆటగాళ్ల ఇన్‌స్టాగ్రామ్‌ ముచ్చట్లను పక్కన పెట్టి ఇప్పుడు అసలైన ఆటను వీక్షించేందుకు అభిమానులు రెడీగా ఉన్నారు.

పిచ్, వాతావరణం
సహజంగా ఇంగ్లండ్‌లో ఉండే పరిస్థితులే రోజ్‌బౌల్‌ పిచ్‌లోనూ ఉన్నాయి. ఆరంభంలో స్వింగ్‌కు అనుకూలం. తర్వాత బ్యాటింగ్‌కు మంచి అవకాశముంది. అయితే తొలి రెండు రోజులు సౌతాంప్టన్‌లో వర్ష సూచన ఉంది. మ్యాచ్‌కు వాన అంతరాయం కలిగించడం ఖాయం. ప్రేక్షకులు లేకపోవడంతో మైదానంలో మ్యూజిక్‌ వినిపిస్తారని వార్తలు వచ్చినా... అదేమీ లేదని ఈసీబీ స్పష్టం చేసింది.

తుది జట్ల వివరాలు (అంచనా)
ఇంగ్లండ్‌: స్టోక్స్‌ (కెప్టెన్‌), బర్న్స్, సిబ్లీ, డెన్లీ, క్రాలీ, పోప్, బట్లర్, బెస్, ఆర్చర్, బ్రాడ్, అండర్సన్‌.
వెస్టిండీస్‌: హోల్డర్‌ (కెప్టెన్‌), బ్రాత్‌వైట్, హోప్, క్యాంప్‌బెల్, బ్రూక్స్, ఛేజ్, డౌరిచ్, కార్న్‌వాల్, అల్జారి జోసెఫ్, రోచ్, గాబ్రియెల్‌.

విశేషాలు
► ఇరు జట్ల ఆటగాళ్లు బ్లాక్స్‌ లైవ్స్‌ మ్యాటర్‌ లోగోను తమ జెర్సీల కాలర్‌పై ధరించి బరిలోకి దిగనున్నారు.  
► రెండు జట్ల మధ్య ఇప్పటి వరకు జరిగిన 157 టెస్టుల్లో విండీస్‌ 57, ఇంగ్లండ్‌ 49 గెలిచాయి. మరో 51 ‘డ్రా’గా ముగిశాయి.  
► కీమర్‌ రోచ్‌ మరో 7 వికెట్లు తీస్తే టెస్టుల్లో 200 వికెట్లు పూర్తి చేసుకుంటాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top