కప్పు ఫ్రాన్స్‌ది కాదు.. ఆఫ్రికాది! 

African Team Defeats Croatia to Win the FIFA World Cup 2018 - Sakshi

కరాకస్‌ (వెనిజువెలా): హోరాహోరీ ఫుట్‌బాల్‌ ప్రపంచ కప్‌ సంగ్రామాన్ని ఆస్వా దించాం! ఆఖరి ఘట్టంలో ఫ్రాన్స్‌ జయకేతనం ఎగురవేయడాన్ని కళ్లారా చూశాం! కానీ, కప్‌ గెలిచింది ఆఫ్రికా అంటున్నారు వెనిజువెలా దేశాధ్యక్షుడు నికొలస్‌ మడురొ. ‘ఫ్రాన్స్‌... ఆఫ్రికా జట్టులా కనిపిస్తోంది. తక్కువ చూపు చూసిన వలస కుటుంబాల ఆటగాళ్లతో ఆఫ్రికానే కప్‌ గెలిచినట్లుంది. అందుకే వారికి ధన్యవాదాలు’ అని నికొలస్‌ వ్యాఖ్యానించారు. మడురో మాటల్లో కొంత తర్కం లేకపోలేదు. 23 మంది సభ్యుల ఫ్రాన్స్‌ జట్టులో 16 మంది ఆఫ్రికా మూలాలున్నవారే మరి. ఫైనల్లో గోల్స్‌ చేసిన ఎంబాపె తల్లిదండ్రులు కామెరూన్, అల్జీరియా వాసులు కాగా, పోగ్బా అమ్మానాన్న గినియాకు చెందినవారు.

ఇక ఉమ్‌టిటి... కామెరూన్‌లో పుట్టాడు. మట్యుడి తల్లిదండ్రులు అంగోలా, కాంగో దేశస్తులు. ఎంగొలొ కాంటె పెద్దలది మాలి నేపథ్యం. రాఫెల్‌ వరానె తండ్రి కరీబియన్‌ దీవుల నుంచి వచ్చాడు. ఈ నేపథ్యంలో... ఫ్రాన్స్‌ సహా యూరప్‌ దేశాలు ఇకనైనా ప్రతిభావంతులు, ప్రభావవంతులైన ఆఫ్రికా, లాటిన్‌ అమెరిక్లను తక్కువగా చూడొద్దని మడురో కోరారు. ‘యూరప్‌లో జాతి వివక్షకు ఇది అంతం. కప్‌ సాధించి పెట్టినందుకు వారు మమ్మల్ని అభినందించాలి’ అని పేర్కొన్నారు. అయితే, మడురో నియంతలా వ్యవహరిస్తున్నారని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రోన్‌ గతంలో విమర్శించారు. మాక్రోన్‌ విమర్శలను మనసులో పెట్టుకొనే ప్రస్తుతం ఫ్రాన్స్‌ విజయాన్ని తక్కువ చేసి చూపేలా వెనిజువెలా అధ్యక్షుడు మాట్లాడినట్లు తెలుస్తోంది.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top