టి20 చరిత్రలో రికార్డు స్కోరు

Afghanistan set a new Twenty20 record against Ireland - Sakshi

ఐర్లాండ్‌పై చెలరేగిన ఓపెనర్‌

62 బంతుల్లో 11 ఫోర్లు, 16 సిక్స్‌లతో 162 నాటౌట్‌

టి20ల్లో అఫ్గాన్‌ రికార్డు స్కోరు  

డెహ్రాడూన్‌: అఫ్గానిస్తాన్‌ ఓపెనర్‌ హజ్రతుల్లా జజాయ్‌ (62 బంతుల్లో 162 నాటౌట్‌; 11 ఫోర్లు, 16 సిక్స్‌లు) ఐర్లాండ్‌ బౌలర్లను కసిదీరా బాదాడు. ఆకాశమే హద్దుగా విరుచుకుపడిన వేళ... ఇరు జట్ల మధ్య శనివారం ఇక్కడ జరిగిన రెండో టి20లో అఫ్గానిస్తాన్‌ టి20 చరిత్రలోనే రికార్డు స్కోరు చేసింది. హజ్రతుల్లా వీర విజృంభణకు తోడు ఉస్మాన్‌ ఘని (48 బంతుల్లో 73; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో అఫ్గానిస్తాన్‌ మూడు వికెట్లకు 278 పరుగులు సాధించింది. అద్భుతం జరిగితే తప్ప ఛేదించలేనంత లక్ష్యంతో బరిలో దిగిన ఐర్లాండ్‌... ఓపెనర్, కెప్టెన్‌ స్టిర్లింగ్‌ (50 బంతుల్లో 91; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు) పోరాటంతో ఆరు వికెట్లకు 194 పరుగులు చేసి 84 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 10వ ఓవర్‌ వరకు 109/0తో బాగానే సాగిన ఐర్లాండ్‌ ఇన్నింగ్స్‌ మిస్టరీ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ (4/25) రంగప్రవేశంతో చెదిరిపోయింది. 

►278 - టి20ల్లో అత్యధిక జట్టు స్కోరు ఇది. 2016లో శ్రీలంకపై ఆస్ట్రేలియా (263/3) నెలకొల్పిన రికార్డు తెరమరుగైంది. 
►236 - ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో హజ్రతుల్లా, ఘని తొలి వికెట్‌కు జోడించిన పరుగులు. టి20ల్లో ఏ వికెట్‌కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యం.
► 16 - ఈ మ్యాచ్‌లో హజ్రతుల్లా కొట్టిన సిక్స్‌లు. వ్యక్తిగత టి20 ఇన్నింగ్స్‌లో ఇవే అత్యధికం.
►42 - సెంచరీకి హజ్రతుల్లా ఆడిన బంతులు. అంతర్జాతీయ టి20ల్లో ఇది మూడో వేగవంతమైన సెంచరీ.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top