
బీజింగ్: ఆడుతోంది తొలి ప్రపంచకప్ ఫైనల్... బరిలో మేటి షూటర్లు... అయినా ఎలాంటి ఒత్తిడికి లోనుకాలేదు... ఆద్యంతం అద్భుత ప్రదర్శన చేసి ఒకే గురికి రెండు లక్ష్యాలు సాధించాడు భారత షూటర్ అభిషేక్ వర్మ. ఇక్కడ జరుగుతోన్న ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్‌లో అభిషేక్ వర్మ రూపంలో భారత్‌కు మూడో స్వర్ణం లభించింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో అభిషేక్ వర్మ 242.7 పాయింట్లు స్కోరు చేసి పసిడి పతకం గెల్చుకున్నాడు. అంతేకాకుండా భారత్‌కు టోక్యో ఒలింపిక్స్ బెర్త్‌ను అందించాడు. అర్తెమ్ చెముస్కోవ్ (రష్యా–240.4 పాయింట్లు) రజతం... సెయుంగ్‌వు హాన్ (కొరియా–220 పాయింట్లు) కాంస్యం సాధించారు.
హరియాణాలో న్యాయవాదిగా ఉన్న 29 ఏళ్ల అభిషేక్ వర్మ క్వాలిఫయింగ్‌లో 585 పాయింట్లు స్కోరు చేసి నాలుగో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించాడు. ఎనిమిది మంది పాల్గొన్న ఫైనల్లో తొలి షాట్ నుంచి చివరి షాట్ ముగిసేవరకు అభిషేక్ ఆధిక్యంలో ఉండటం విశేషం.