‘క్రికెట్‌కు కాదు.. కుస్తీకి సిద్ధమవుతున్నారు’

Aamir Sohail Says Pakistan Players Preparing More For WWE Than Cricket - Sakshi

ఇస్లామాబాద్‌ : శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో ఘోర అపజయాన్ని మూటగట్టుకున్న పాకిస్తాన్ జట్టుపై విమర్శలు కొనసాగుతున్నాయి. టీ20ల్లో నంబర్‌ వన్‌ జట్టుగా పేరు తెచ్చుకున్న పాక్‌.. ప్రత్యర్థి జట్టు చేతిలో చిత్తుచిత్తుగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. భద్రతా కారణాల దృష్ట్యా స్టార్‌ ఆటగాళ్లు పాక్ పర్యటనకు రాకపోయినప్పటికీ... శ్రీలంక యువ క్రికెటర్లు పాక్‌ను క్లీన్‌స్వీప్‌ చేసి సత్తా చాటారు. ఈ క్రమంలో పాక్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ సహా హెడ్‌కోచ్‌, చీఫ్‌ సెలక్టర్‌ మిస్బావుల్‌ హక్‌పై అభిమానులు విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ ఆమిర్‌ సోహైల్‌ కూడా పాక్‌ ఆటగాళ్ల తీరుపై విమర్శలు గుప్పించాడు. ‘ ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామంటూ పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు చెబుతోంది. అయితే క్రికెట్‌కు తక్కువ... కుస్తీ పోటీలకు ఎక్కువ అన్నట్లు క్రికెటర్ల ఆకారం కనబడుతోంది. వీళ్లు ఒలంపిక్స్‌ లేదా డబ్ల్యూడబ్ల్యూఈ కుస్తీ పోటీలకు సిద్ధం అవుతున్నారో అర్థం కావడం లేదు’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. (చదవండి : కటౌట్‌ను కసితీరా తన్నిన ఫ్యాన్‌..!)

కాగా ప్రపంచకప్‌ సమయంలోనూ పాక్‌ క్రికెటర్ల ఫిట్‌నెస్‌ చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.  టీమిండియాతో ఓటమి తర్వాత.. ‘మా టీం తిండి తినడం మీద చూపే శ్రద్ధలో పావు వంతు అయినా ఫిట్‌నెస్‌, క్రమశిక్షణ మీద చూపిస్తే బాగుండేది. పిజ్జాలు బర్గర్లు తింటారు తప్ప మైదానంలో పోరాడలేరు. రేపు మ్యాచ్‌ ఉందంటే.. ఫిట్‌నెస్‌ గురించి ఏ మాత్రం ఆలోచించకుండా.. జంక్‌ ఫుడ్‌ తిని కడుపు నింపుకోవడంలో మా ఆటగాళ్లు బిజీగా ఉంటారు’  అంటూ ఓ అభిమాని సోషల్‌ మీడియాలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో పాక్‌ జట్టుపై విపరీతంగా జోకులు పేలడంతో పాటు విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో జట్టు కోచ్‌గా పగ్గాలు చేపట్టిన మిస్బా... ఫిట్‌నెస్‌ ప్రమాణాలు పెంచి ఆటగాళ్లు మైదానంలో మరింత చురుగ్గా ఉండేలా చేసేందుకు ప్రణాళికలు రచించాడు. బిర్యానీతో పాటు నూనె ఎక్కువగా వాడి వండే రెడ్‌ మీట్, మిఠాయిలకు దూరంగా ఉంచాలని అతడు ఆటగాళ్లకు సూచించాడు. 
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top