
ఈ సిరీస్ విలువెంత..?
దాదాపు ఏడాదిన్నర క్రితం వన్డే వరల్డ్ కప్ మ్యాచ్‌లో జింబాబ్వే, భారత్‌కు ముచ్చెమటలు పట్టించింది.
జింబాబ్వే 126 ఓవర్లలో 30 వికెట్లకు చేసిన పరుగులు 417... భారత్ 90.3 ఓవర్లలో 3 వికెట్లకు చేసిన పరుగులు 428! మూడు వన్డేలలో కలిపి ఈ భారీ తేడా చూస్తే చాలు సిరీస్ ఎంత ఏకపక్షంగా సాగిందో చెప్పవచ్చు. ద్వితీయ శ్రేణి జట్టుకంటే కూడా ఇంకా జూనియర్లతో నిండిన భారత జట్టుకు... సొంతగడ్డపై అనుభవం ఉన్న జింబాబ్వే అసలు ఏ మాత్రం పోటీ ఇవ్వకుండా తలవంచడం చాలా ఆశ్చర్యం కలిగించింది. భారత్ చేతిలో గత రెండు వన్డే సిరీస్‌లలో కూడా క్లీన్‌స్వీప్‌కు గురైన జింబాబ్వే, ఈ సారి మరింత అధమ స్థాయిలో ఆటతీరు కనబర్చింది.
సాక్షి క్రీడా విభాగం: దాదాపు ఏడాదిన్నర క్రితం వన్డే వరల్డ్ కప్ మ్యాచ్‌లో జింబాబ్వే, భారత్‌కు ముచ్చెమటలు పట్టించింది. 287 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తూ భారత్ తక్కువ వ్యవధిలో నాలుగు వికెట్లు కోల్పోయింది. అదృష్టవశాత్తూ రైనా, ధోని ఆడటంతో చివరకు ఎనిమిది బంతులు మిగిలి ఉండగా భారత్‌కు విజయం దక్కింది. సుదీర్ఘ కాలం అంతర్గత సమస్యలతో బాధ పడిన అనంతరం జింబాబ్వే క్రికెట్ మళ్లీ మంచి స్థితికి చేరుకుంటున్నట్లు నాడు అనిపించింది. కానీ ఆ జట్టు ఏమీ మారలేదని, ఇంకా దిగజారిందని ఇప్పుడు అర్థమవుతోంది. అటు క్రికెట్ వర్గాల్లో, ఇటు అభిమానుల్లో ఏ మాత్రం ఆసక్తి రేకెత్తించకుండా ఈ సిరీస్ ముగిసిపోయింది.
ఘోర వైఫల్యం
‘మైదానం పక్కన టమాటో చెట్టు ఉంటే ఈ అవమానం తట్టుకోలేక అదే చెట్టుకు ఉరి వేసుకునేవాడినేమో’... రెండో వన్డేలో ఓటమి తర్వాత జింబాబ్వే కోచ్ మఖయా ఎన్తిని ఆవేశంగా చేసిన వ్యాఖ్య ఇది. ఇప్పుడు మూడో మ్యాచ్ తర్వాత అతను ఏమంటాడో మరి! ఎన్తిని మాటలు కాస్త అతిగా అనిపించినా, ఆ జట్టు బ్యాట్స్‌మెన్ ఆడిన తీరు మాత్రం పూర్తిగా నిరాశజనకం. ఈ సిరీస్ కోసం జింబాబ్వే తమకు అందుబాటులో ఉన్న అత్యుత్తమ జట్టునే ఎంపిక చేసింది.
గాయంతో దూరమైన పన్యగర మినహా వీరంతా రెగ్యులర్ సభ్యులే. జట్టులో సగంకంటే ఎక్కువ మందికి కనీసం 50 వన్డేలు ఆడిన అనుభవం ఉంది. భారత ఆటగాళ్లతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. ఎన్నో ఏళ్లుగా తమ ప్రధాన వేదిక అయిన హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానంలోనే ఆడుతున్నారు. అయినా సరే సాధారణ ప్రదర్శన కూడా ఇవ్వకపోగా మ్యాచ్ మ్యాచ్‌కూ జట్టు స్కోరు తగ్గుతూ (168, 126, 123) పోయింది. సిరీస్‌లో ఒక సారి కూడా టీమ్ 50 ఓవర్లు ఆడలేకపోగా, మొత్తంగా ఒకే ఒక అర్ధ సెంచరీ నమోదైంది. టి20ల్లో కూడా ఒక జట్టు ఇంత తక్కువ స్కోరు చేయని ఈ రోజుల్లో జింబాబ్వే వన్డేల్లో చేసిన స్కోర్లు ఆ జట్టు భవితవ్యంపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.
మనకు పనికొచ్చిందా..?
ముగ్గురు కొత్త ఓపెనర్లతో భారత జట్టు ఒక సిరీస్ ఆడటం ఇదే తొలిసారి. వీరిలో 196 పరుగులతో ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచిన లోకేశ్ రాహుల్ ఈ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకున్నాడు. ఇప్పటికే టెస్టులో రెగ్యులర్ సభ్యుడైన రాహుల్ వన్డే ప్రధాన టీమ్‌లోకి కూడా వచ్చేందుకు మార్గం సుగమం చేసుకున్నాడు. కరుణ్ నాయర్‌లో ఒక ఇన్నింగ్స్‌లో మెరుగ్గా ఆడగా, ఫజల్ తొలి అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు.
రాయుడు రెండు ఇన్నింగ్స్‌లలోనూ నాటౌట్‌గా నిలిచాడు. మూడు మ్యాచ్‌లలో ధోని, కేదార్ జాదవ్‌లకు బ్యాటింగ్ అవకాశమే రాకపోగా, మనీశ్ పాండే ఒకే ఒక బంతిని ఎదుర్కొన్నాడు. మూడుసార్లూ భారత్ ముందుగా ఫీల్డింగ్ చేయడంతో భారీ స్కోరుకు అవకాశమే రాలేదు. టి20ల్లో ఇప్పటికే ప్రధాన బౌలర్ అయిన బుమ్రా ఇక్కడా సత్తా చాటగా, ‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ చహల్ 6 వికెట్లతో ఆకట్టుకున్నాడు.
తర్వాతి వన్డే సిరీస్‌లో ప్రధాన ఆటగాళ్లు వచ్చినప్పుడు వీరిలో ఎంత మంది తన స్థానం నిలబెట్టుకోగలరో ఇప్పుడే చెప్పలేం కానీ తమ ఆటతో ఈ సిరీస్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఆటగాళ్లుగా రాహుల్, చహల్‌లను చెప్పవచ్చు. దాదాపు ఇదే జట్ల మధ్య ఉండే టి20 సిరీస్‌లో జింబాబ్వే ఏ మాత్రం పోటీనిస్తుందో చూడాలి.
‘టి20 సిరీస్’ స్పాన్సర్ ప్రయాగ్
భారత్, జింబాబ్వే మధ్య జరిగే మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌కు శానిటరీవేర్ బ్రాండ్ ‘ప్రయాగ్’ టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. ఈ సిరీస్‌ను ‘ప్రయాగ్ కప్ 2016’గా వ్యవహరిస్తారు. భారత్, జింబాబ్వే మధ్య జూన్ 18, 20, 22 తేదీలలో మూడు టి20 మ్యాచ్‌లు జరుగుతాయి.