ధోని @ 10వేలు.. చహల్‌ కొత్త రికార్డు! | 2019 Rewind: Best Moments Of Indian Cricket | Sakshi
Sakshi News home page

ధోని @ 10వేలు.. చహల్‌ కొత్త రికార్డు!

Dec 24 2019 2:44 PM | Updated on Dec 30 2019 2:13 PM

2019 Rewind: Best Moments Of Indian Cricket - Sakshi

గతేడాది నవంబర్‌లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన టీమిండియా తన సత్తాను చాటింది. మూడు టీ20ల సిరీస్‌లో ఒక మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కాగా ఇరు జట్లు తలో మ్యాచ్‌ గెలిచి  సిరీస్‌లో సమంగా నిలిచాయి. ఇక డిసెంబర్‌లో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌ను కోహ్లి నేతృత్వంలోని టీమిండియా 2-1తో గెలిచి ఆసీస్‌కు షాకిచ్చింది. ఆస్ట్రేలియా తొలిసారి టెస్ట్‌ సిరీస్‌ గెలవడం కోహ్లి అండ్‌ గ్యాంగ్‌ సరికొత్త ఉత్సాహంతో వన్డే సిరీస్‌కు సిద్ధమైంది.

అదే ఊపును మూడు వన్డేల సిరీస్‌లో కూడా టీమిండియా కొనసాగించింది. ఈ ఏడాది(2019)జనవరి నెలలో జరిగిన వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో గెలిచి ఆసీస్‌పై ఓవరాల్‌గా పైచేయి సాధించింది.  తొలి వన్డేలో ఆసీస్‌ గెలిచినప్పటికీ, మిగతా రెండు వన్డేల్లో టీమిండియానే విజయం నమోదు చేసి సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో ఆసీస్‌ నిర్దేశించిన లక్ష్యాన్ని భారత్‌ ఛేదించింది. ఈ వన్డే సిరీస్‌లో కోహ్లి, ధోనిలు రాణించడంతో భారత్‌ సిరీస్‌ను సునాయాసంగా చేజిక్కించుకుంది. వన్డే సిరీస్‌కు సంబంధించిన విశేషాలను మరొకసారి రిపీట్‌ చేసుకుందాం..

ధోని @ 10వేలు
టీమిండియాతో జరిగిన తొలి వన్డేలో ఆసీస్‌ విజయం సాధించినప్పటికీ, భారత మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని ఒక అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. భారత్‌ తరపున అంతర్జాతీయ వన్డేల్లో పదివేల పరుగుల మార్కును ధోని చేరాడు. ఫలితంగా ఈ ఘనత సాధించిన ఐదో భారత క్రికెటర్‌గా ధోని గుర్తింపు పొందాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో ధోని ఈ ఫీట్‌ను సాధించాడు. ఈ మ్యాచ్‌కు ముందు 9,999 పరుగులతో ఉన్న ధోని.. పరుగు సాధించడంతో టీమిండియా తరఫున పదివేల పరుగుల మార్కును చేరుకున్నాడు. నిజానికి గతేడాదే ధోని 10వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. 2007లో ఆఫ్రికా ఎలెవన్, ఆసియా ఎలెవన్ మధ్య జరిగిన ఆ టోర్నీలో మూడు వన్డేలాడిన ధోని 174 పరుగులు చేశాడు. దాంతో భారత్‌ తరఫున వన్డేల్లో పదివేల పరుగును మార్కును చేరుకోవడానికి ఆసీస్‌తో సిరీస్‌ వేదికైంది. తొలి వన్డేలో ఆసీస్‌ 289 పరుగుల్ని నిర్దేశించగా, భారత్‌ 254 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో ధోని 51 పరుగులు చేశాడు.  రోహిత్‌ శర్మ 133 పరుగులు చేసినప్పటికీ కోహ్లి, అంబటి రాయుడులు విఫలం కావడంతో భారత్‌ ఓటమి పాలైంది.

రోహిత్‌ సెంచరీల రికార్డు
ఆసీస్‌తో సిరీస్‌ తొలి  వన్డే ద్వారానే టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ సైతం ఒక మైలురాయిని నెలకొల్పాడు. ఆస్ట్రేలియాపై అత్యధిక వన్డే  సెంచరీలు సాధించిన రెండో క్రికెటర్‌గా రోహిత్‌ నిలిచాడు. ఇది ఆసీస్‌పై వన్డేల్లో రోహిత్‌కు 7వ సెంచరీ కాగా, ఓవరాల్‌గా 22వ వన్డే శతకం. రోహిత్‌ కంటే ముందు ఆసీస్‌పై అత్యధిక వన్డే సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో సచిన్‌ టెండూల‍్కర్‌ తొలి స్థానంలో  ఉన్నాడు. ఆసీస్‌పై సచిన్‌ 9వన్డే సెంచరీలు సాధించాడు.

ధోని ‘హ్యాట్రిక్‌’
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ ధోని హ్యాట్రిక్‌ హాఫ్‌ సెంచరీలు సాధించాడు. తొలి వన్డేలో 51 పరుగులు చేసిన ఈ సీనియర్‌ వికెట్‌ కీపర్‌.. రెండో వన్డేలో 55 పరుగులతో నాటౌట్‌గా నిలిచి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. మెల్‌బోర్న్‌ వేదికగా సిరీస్‌ నిర్ణయాత్మక మ్యాచ్‌లో ధోని 87 పరుగులు సాధించాడు. ఫలితంగా టీమిండియా వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది.

విజయ్‌ వన్డే అరేంగేట్రం.. చహల్‌ కొత్త రికార్డు
ఈ సిరీస్‌ ద్వారా భారత్‌ ఆల్‌ రౌండర్‌ విజయ శంకర్‌ తెరపైకి వచ్చాడు. మెల్‌బోర్న్‌లో జరిగిన ఆఖరి వన్డే మ్యాచ్‌లో విజయ్‌ శంకర్‌కు అవకాశం దక్కింది. దాంతో వన్డేల్లో విజయ్‌ శంకర్‌ అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో విజయ్‌ శంకర్‌కు బ్యాటింగ్‌కు చేసే అవకాశం రాలేదు. ఇక బౌలింగ్‌లో ఆరు ఓవర్లు పాటెఉ బౌలింగ్‌ వేసి 23 పరుగులు ఇచ్చాడు. కాగా, భారత్‌  స్పిన్నర్‌ యజ్వేంద్ర చహల్‌ ఆరు  వికెట్లు సాధించి ఆసీస్‌ నడ్డి విరిచాడు. ఈ క్రమంలోనే రికార్డును సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై ఆస్ట్రేలియా గడ్డపై 6 వికెట్లు తీసిన తొలి స్పిన్నర్‌గా రికార్డు సృష్టించాడు. అదే సమయంలో అప్పటివరకూ టీమిండియా కోచ్‌ రవిశాస్త్రి పేరిట ఉన్న ఐదు వికెట్ల ఘనతను సైతం చహల్‌ సవరించాడు.

పాండ్యా, రాహుల్‌లపై వేటు
అంతర్జాతీయ క్రికెటర్లమనే సోయి మరిచిన హార్దిక్‌ పాండ్యా, కేఎల్‌ రాహుల్‌  ఓ టీవీ షోలో మహిళల పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలతో సర్వత్రా విమర్శలు  ఎదుర్కొన్నారు. విమర్శలే కాదు.. కెప్టెన్‌ కోహ్లి, బీసీసీఐ అధికారుల ఆగ్రహానికి కూడా గురయ్యారు. ఈ అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఈ యువ ఆటగాళ్లపై బీసీసీఐ సస్పెన్షన్‌ వేటు వేసింది.  దాంతో ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు దూరమయ్యారు. బాలీవుడ్‌ దర్శక నిర్మాత కరణ్‌ జోహర్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘కాఫీ విత్‌ కరణ్‌’ టీవీ షోలో పాండ్యా, రాహుల్‌ ఇద్దరు అశ్లీల రీతిలో మహిళల్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement