తారాస్థాయికి చేరిన నకిలీ వార్తలు

Hoax News Of Pig Gives Birth To Human Baby - Sakshi

సోషల్‌ మీడియాలో నకిలీ వార్తలు పేట్రేగిపోతున్నాయి. తాజాగా ‘బ్రహ్మం గారు చెప్పినట్లే జరిగింది. పంది కడుపున మనిషి జన్మించాడు.’ అనే నకిలీ వార్త సోషల్‌ మీడియాలో విపరీతంగా షేర్‌ అవుతోంది. పంది కడుపున మనిషి శిశువు జన్మించినట్లు చూపుతున్న ఫొటోలు పోస్టుకు జత చేసి నెటిజన్లు షేర్‌ చేసుకుంటున్నారు. అయితే, అవన్నీ తప్పుడు కథనాలు. సిలికాన్‌తో బొమ్మలను తయారు చేసే ఆర్టిస్ట్‌ మగానుకో లైరా పంది రూపంలో ఉన్న మానవ శిశువును తయారు చేశారు.

లైరా సొంత దేశం ఇటలీ. సిలికాన్‌తో అద్భుతమైన బొమ్మలు చేయడంలో ఆమె చేయి తిరిగిన వారు. అలా పంది రూపంలోని మానవ శిశువును తయారు చేసిన ఆమె దాన్ని తన సొంత ఆన్‌లైన్‌ స్టోర్‌ ఎస్టీ.కామ్‌ అమ్మకానికి పెట్టారు. రకరకాలుగా దాన్ని ఫొటోలు తీసి, అందంగా ఉంచేందుకు ప్రయత్నాలు చేశారు. ప్రస్తుతం ఆ ఫొటోలే నకిలీ వార్తగా మారి, బ్రహ్మంగారు చెప్పినదే జరిగిందనే భ్రమలో ప్రజలను పడేసింది.

ముఖ్యంగా ఈ వార్త తెలంగాణలో విపరీతంగా చక్కర్లు కొట్టింది. ఎక్కడో కాదు యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం వీరారెడ్డిపల్లిలోనే ఈ సంఘటన జరిగిందని వాట్సాప్‌లో షేర్‌ అవుతోంది. నకిలీ వార్తల ప్రభావంతో ఈ మధ్యకాలంలోనే వాట్సాప్‌ కొత్త అప్‌డేట్‌ను ప్రవేశపెట్టింది. అంతేకాకుండా పత్రికల్లో ప్రకటన ఇస్తూ సైతం నకిలీ వార్తలను నమ్మొద్దని ఏ విషయాన్నైనా రెండు, మూడు సార్లు తరచి చూసిన తర్వాతే షేర్‌ చేయండని ప్రజలను కోరింది.

ఒకరికి తెలిసిన మాట, ఇంకొకరి నోటి నుంచి బయటకు వెళ్లేప్పుడు దాన్ని కొంత ఎక్కువ చేసి చెప్పడం సహజం. ఈ రకంగానే పంది వార్త షేర్‌ అయినట్లు అర్థం అవుతోంది. కాగా, నకిలీ వార్తల కారణంగా దేశంలో పిల్లలు ఎత్తుకుపోతున్నారనే సందేహంతో ఏ నేరం చేయని వారిని ప్రజలు చంపుతున్న సంగతి తెలిసిందే.

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top