‘ఈనాడు’ బరితెగింపు.. అవే అబద్ధాలు.. అదే దుష్ప్రచారం | Fake News on YS Jagan in Emaar Properties Case | Sakshi
Sakshi News home page

‘ఈనాడు’ బరితెగింపు.. అవే అబద్ధాలు.. అదే దుష్ప్రచారం

Nov 29 2025 5:08 AM | Updated on Nov 29 2025 5:08 AM

Fake News on YS Jagan in Emaar Properties Case

ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ కేసు పేరిట వైఎస్‌ జగన్‌పై విష ప్రచారం

చిన్న వ్యాపారాలు చేసుకునే సునీల్‌రెడ్డి.. వైఎస్‌ జగన్‌కు సన్నిహితుడంటూ అవాస్తవాలు

కేవలం ముఖ పరిచయం ఉన్నవారిని బినావీులని చిత్రీకరణ

ఆ సూత్రం ప్రకారం.. రామోజీ కుటుంబం, రాధాకృష్ణ, బీఆర్‌ నాయుడు, గీతం మూర్తి.. చంద్రబాబుకు బినావీులనుకోవాలా?

ఎమ్మార్‌ కేసుతో వైఎస్‌ జగన్‌కు ఏం సంబంధం?.. అసలు ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌కు భూములిచ్చిందే బాబు.. ఇస్తేగిస్తే ముడుపులు ఆయనకే ఇవ్వాలి!

కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు కుట్రతోనే వైఎస్‌ జగన్‌పై అక్రమ కేసులు

సాక్షి, అమరావతి: టీడీపీ భజంత్రీ పత్రిక, దుష్ప్రచార విష పుత్రిక ‘ఈనాడు’ మరోసారి తన మార్కు కుట్రకు బరితెగించింది! దశాబ్దాలుగా అవాస్తవాలు వండివార్చి నిత్యం ఉషోదయంతో ప్రజలను తప్పుదారి పట్టించే కుతంత్రాన్ని కొత్త పుంతలు తొక్కిస్తోంది. ఎన్నికల మేనిఫెస్టో అమలులో దారుణంగా విఫలమైన చంద్రబాబుకు రక్షా కవచంగా మరోసారి దుష్ప్రచారానికి దిగింది. మాజీ ముఖ్య­మంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఏమాత్రం సంబంధంలేని ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ కేసుతో ఆయనకు ముడిపెట్టేందుకు యత్నిస్తోంది. ఆ కేసులో నిందితుడుగా ఉన్న సునీల్‌రెడ్డి ఆయనకు సన్నిహితుడు అంటూ నిస్సిగ్గుగా అవాస్తవ కథనాన్ని ప్రచురించి తన వక్రబుద్ధిని ప్రదర్శించింది.

సునీల్‌రెడ్డిని సిట్‌ విచారించిన సమాచారాన్ని వార్తా కథనంగా ప్రచురిస్తూ, అందులో ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ కేసు వివరాలను వక్రీకరిస్తూ దుష్ప్రచారానికి తెగబడింది. కేవలం ముఖ పరిచయం ఉన్నవారిని బినావీులని చిత్రీకరిస్తోంది. మరి అదే సిద్ధాంతం ప్రకారం.. చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన రామోజీ కుటుంబం, రాధాకృష్ణ, బీఆర్‌ నాయుడు, గీతం మూర్తి ఆయనకు బినావీులనుకోవాలా? చిన్నా చితక వ్యాపారాలు చేసుకుంటున్న సునీల్‌రెడ్డి దుబాయ్‌లో పెట్టుబడులు పెట్టాడని, వైఎస్‌ జగన్‌కు సన్నిహితుడని ఎల్లో మీడియా బురద చల్లుతోంది. లేని ఆస్తులను, లేని నగదును సునీల్‌వంటూ దుష్ప్రచారం చేస్తోంది.

అసలు ఎమ్మార్‌ కేసుతో వైఎస్‌ జగన్‌కు ఏం సంబంధం? ఈ వ్యవహారంతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదని సీఐడీ చార్జిషీట్‌లోనే పేర్కొంది. ఇంకా చెప్పాలంటే.. ఆ కంపెనీకి నాడు భూములిచ్చిందే చంద్రబాబు. దాని ప్రమోటర్‌ ఆయనకు అత్యంత సన్నిహితుడు. ఇస్తేగిస్తే చంద్రబాబుకే ముడుపులివ్వాలి! వైఎస్‌ జగన్‌పై అక్రమ కేసుల నమోదు చంద్రబాబు, నాడు కాంగ్రెస్‌ కుట్రే! టీడీపీ నేతలతో కలసి కేసులు వేయించి నాడు కిరణ్‌కుమార్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ సర్కారును కాపాడింది చంద్రబాబే!

‘ఈనాడు’ దుష్ప్రచార కుట్ర
తన పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే చంద్రబాబు డైవర్షన్‌ కుట్రలో భాగంగానే ఈనాడు పత్రిక ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ కేసును వక్రీకరిస్తూ కథనాన్ని ప్రచురించింది. ఆ కేసులో ఏ–7గా ఉన్న హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది, చిన్నా చితకా వ్యాపారాలు చేసుకునే నర్రెడ్డి సునీల్‌రెడ్డి మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు అత్యంత సన్నిహితుడని  చెప్పుకొచ్చింది. ఆయన చెప్పిన పనులను ఎడమ చేతికి తెలియకుండా నమ్మకంగా పని చేసే కుడిభుజం అంటూ పచ్చి అవాస్తవాలు ప్రచురించడం విస్మయపరుస్తోంది. ఈ పదేళ్లలో కలిసినట్లు ఒక్క ఫొటో చూపగలదా? చూపలేదు. ఎందుకంటే దశాబ్దంపైగా వైఎస్‌ జగన్‌ను సునీల్‌రెడ్డి ఏనాడూ వ్యక్తిగతంగా కలవనే లేదు. అయినప్పటికీ ఎల్లో మీడియా పాత ఫోటో ప్రచురించి విష ప్రచారానికి తెగబడింది. సునీల్‌రెడ్డి గత కొన్నేళ్లలో వైఎస్‌ జగన్‌ను ఎప్పుడైనా కలిసినట్లు ఈనాడు గానీ, చంద్రబాబు గానీ చూపించగలరా..?

‘ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌’కు భూములిచ్చింది బాబే
అసలు వాస్తవం ఏమిటంటే... ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ ప్రాజెక్టుకు 1999–2004 మధ్య టీడీపీ హయాంలో ఆమోదం తెలిపింది అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబే. భూములు కేటాయించింది అప్పటి టీడీపీ ప్రభుత్వమే. ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ ప్రమోటర్లు, డైరెక్టర్లు చంద్రబాబుకే సన్నిహితులు. 

బాబు కుట్రతోనే వైఎస్‌ జగన్‌పై అక్రమ కేసులు
వైఎస్‌ జగన్‌పై అక్రమ కేసుల నమోదు చంద్రబాబు, అప్పటి కాంగ్రెస్‌ కుట్రేనన్నది బహిరంగ రహస్యం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హఠాన్మరణానంతరం కాంగ్రెస్‌ అధిష్టానంతో జట్టు కట్టి చంద్రబాబు ఈ కుట్రకు తెరతీశారు. అప్పటి కాంగ్రెస్‌ మంత్రి శంకర్‌రావు, టీడీపీ నేతలు అశోక్‌ గజపతిరాజు, ఎర్రన్నాయుడు కలిసే వైఎస్‌ జగన్‌కు వ్యతిరేకంగా పిటిషన్లు దాఖలు చేయడమే అందుకు తార్కాణం. ఇక అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు అప్పటి కిరణ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కాపాడింది చంద్రబాబే. ఆ విధంగా కాంగ్రెస్, టీడీపీ కలిసే వైఎస్‌ జగన్‌పై అక్రమ కేసులు నమోదు చేయించాయన్న వాస్తవం ప్రజలందరికీ తెలుసు. అదే కుట్రను కొనసాగిస్తూ ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ కేసు పేరిట వైఎస్‌ జగన్‌పై ఈనాడు పత్రిక విష ప్రచారం చేస్తోంది. చంద్రబాబు ఆదేశాలతోనే అవాస్తవ కథనాలను ప్రచురిస్తోంది.

ఆ కుటుంబాల ఆస్తులన్నీ బాబు బినావీుయేనా...!
ఫొటోలు దిగితేనే సన్నిహితుడు, బినామీ అయితే... చంద్రబాబు, లోకేశ్‌ ఎందరెందరితోనో ఫొటోలు దిగుతూ ఉంటారు. వారంతా ఆ తండ్రీకుమారులకు బినావీులుగానే పరిగణించాలా మరి...! అసలు క్విడ్‌ప్రోకో, బినామీ అనే పదాలు చంద్రబాబుకే వర్తిస్తాయి. ‘ఈనాడు’ రామోజీరావు కుటుంబం, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కుటుంబం, టీవీ 5 బీఆర్‌ నాయుడు కుటుంబం, విశాఖపట్నం టీడీపీ ఎంపీ ఎం. భరత్‌ కుటుంబం... ఇలా ఈ జాబితాకు అంతే లేదు. వారందరూ చంద్రబాబుకు అత్యంత సన్నిహితులే కాదు... ఆయన రాజకీయ కుట్రలో భాగస్వాములు కూడా. 1995లో వైస్రాయ్‌ హోటల్‌ ఎపిసోడ్‌తో ఎన్టీరామారావుకు వెన్నుపోటు కుట్రలో వారందరూ భాగస్వాములే కదా.  చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టగానే రామోజీ కుటుంబ అక్రమ ఆర్థిక సామ్రాజ్య విస్తరణకు పూర్తిగా సహకరించారు.

ఎన్టీ రామారావు అమలు చేసిన సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని తొలగించారు. రామోజీ ఫిల్మ్‌ సిటీ వ్యాపార ప్రయోజనాల కోసమే ఇదంతా చేశారు. టీడీపీ ప్రభుత్వ అండతోనే రామోజీ రావు కుటుంబం రంగారెడ్డి జిల్లాలో వేలాది ఎకరాల అసైన్డ్‌ భూములను చెరబట్టి ఫిల్మ్‌ సిటీ నిర్మించింది. ఆర్‌బీఐ నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి డిపాజిటర్స్‌ రూ.వేల కోట్ల అక్రమ డిపాజిట్లు సేకరించింది. మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ యథేచ్ఛగా ఆర్థిక అక్రమాలకు పాల్పడింది. అదే రీతిలో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, విశాఖఫట్నంలో ‘గీతం’ ఎంవీవీఎస్‌ మూర్తి (ప్రస్తుత టీడీపీ ఎంపీ భరత్‌ తాత) కుటుంబాల ఆస్తులు అమాంతంగా పెరిగిన విషయం బహిరంగ రహస్యమే. అదంతా చంద్రబాబు క్విడ్‌ ప్రోకో కుట్రనే. అంటే రామోజీ కుటుంబం, రాధాకృష్ణ, టీవీ 5 బీఆర్‌ నాయుడు, ‘గీతం’ ఎంవీవీఎస్‌ మూర్తి కుటుంబాల ఆస్తులన్నీ చంద్రబాబు బినామీ ఆస్తులేనన్నది స్పష్టమవుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement