అజ్ఞాతవాసుల సర్వే | TDP Survey in Nellore City constituency | Sakshi
Sakshi News home page

అజ్ఞాతవాసుల సర్వే

Published Thu, Jan 18 2018 4:20 AM | Last Updated on Sat, Oct 20 2018 6:04 PM

TDP Survey in Nellore City constituency - Sakshi

నెల్లూరు సిటీ: రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి పొంగూరు నారాయణ నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని గత కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏడునెలలుగా గుట్టుచప్పుడు కాకుండా 50 మందితో నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో ఇంటింటి సర్వే చేయిస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే చాలాచోట్ల వ్యక్తుల పేర్లు, మతం, కులం, ఆధార్, ఫోన్‌ నంబర్, ఓటర్‌కార్డు.. ఇలా సమగ్ర వివరాలను సేకరించారు. ఎవరైనా సర్వే ఎందుకని అడిగితే నగరపాలకసంస్థ తరఫున చేస్తున్నామని చెబుతున్నారు. కార్పొరేషన్‌ నుంచి వచ్చామని చెప్పడంతో ప్రజలు సైతం వారికి పూర్తి వివరాలు అందజేస్తున్నారు. కార్పొరేటర్లు, టీడీపీ డివిజన్‌ ఇన్‌చార్జి ఆధ్వర్యంలో గుట్టుచప్పుడు కాకుండా ఈ తంతు జరుగుతోందని తెలిసింది. 

నారాయణ ఆదేశాలతోనే..
మంత్రి నారాయణ ఆదేశాలతోనే సర్వే చేస్తున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. సిటీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ముందస్తు ప్రణాళికలో భాగంగానే కార్పొరేషన్‌ పేరును వాడుకుంటూ చేయిస్తున్నారని తెలిసింది. ఈ విషయం నగరపాలక సంస్థలో పలువురు అధికారులకు తెలిసినా మున్సిపల్‌ శాఖ మంత్రికి సంబంధించిన వ్యవహారం కావడంతో స్పందించడం లేదని చెబుతున్నారు. 

ఇలా బయటపడింది
నగరంలోని 50వ డివిజన్‌లో ఉన్న సం తపేటలో కొత్తూరుకు చెందిన పర్వేజ్‌ అనే వ్యక్తి కొంతకాలం క్రితం సర్వే చేశాడు. ఇటీవల అతను మళ్లీ డివి జన్‌కు వెళ్లి హౌస్‌ఫర్‌ఆల్‌ కింద ఇళ్లు మంజూరు చేయిస్తానని నమ్మబలి కాడు. ప్రతి దరఖాస్తుదారుడు రూ.2, 000 చెల్లిస్తే ఇళ్లు మంజూరవుతుందని చెప్పారు. కొందరు కార్పొరేషన్‌ సిబ్బంది కదా అని నగదు ఇచ్చారు. బీజేపీ నాయకుడు కప్పిర శ్రీనివాసులు దృష్టికి ఈ విషయం వెళ్లడంతో బుధవారం ఉదయం ఆయన సంతపేటలో పర్వేజ్‌ను పట్టుకుని నిలదీశారు. 

అతను కార్పొరేషన్‌ నుంచి వచ్చినట్లు చెప్పొకొచ్చాడు. శ్రీనివాసులు కార్పొరేషన్‌ అధికారులకు ఫోన్‌ చేసి మాట్లాడగా తమకు సంబంధం లేదని చెప్పారు. దీంతో అతను మాటమార్చి తాను మంత్రి నారాయణ కోసం సర్వే చేస్తున్నట్లు వెల్లడించాడు. పర్వేజ్‌ వద్ద సర్వే పుస్తకం కూడా ఉండటంతో శ్రీనివాసులు అతడిని కార్పొరేషన్‌ కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడి అధికారులకు చూపించి అడగ్గా వారు తమకు తెలియదని తేల్చి చెప్పారు. ఈ క్రమంలో అక్కడే టౌన్‌ప్లానింగ్‌ అధికారులతో సమావేశంలో ఉన్న మంత్రి నారాయణ వద్దకు పర్వేజ్‌ను తీసుకెళ్లారు.

 నారాయణ తాను ఇలాంటి వాటిని ప్రోత్సహించే ప్రసక్తే లేదని, నాలుగోనగర పోలీసులను పిలిపించి అతడిని అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు. దీంతో పర్వేజ్‌ను పోలీసులు పోలీసు స్టేషన్‌కు తరలించారు. సర్వే పుస్తకాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా సర్వే వ్యవహారం బయటపడటంతో మంత్రి వర్గం ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వ్యవహారం టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. సర్వే చేసిన కొందరు ప్రభుత్వ పథకాలు ఇప్పిస్తామంటూ ప్రజల నుంచి నగదు వసూలు చేసినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement