నలుగురు గొలుసు దొంగల అరెస్ట్‌ | The arrest of four chain pirates | Sakshi
Sakshi News home page

నలుగురు గొలుసు దొంగల అరెస్ట్‌

Dec 31 2017 10:56 AM | Updated on Oct 20 2018 6:07 PM

నెల్లూరు(క్రైమ్‌): గొలుసు దొంగతనాలకు పాల్పడుతూ రెండేళ్లుగా పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న నలుగురు సభ్యుల ముఠాను సీసీఎస్, నెల్లూరు నాల్గో నగర పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి రూ.16 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక సీసీఎస్‌ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్రైం ఓఎస్‌డీ టీపీ విఠలేశ్వర్‌ నిందితుల వివరాలను వెల్లడించారు. నగరంలోని పొదలకూరురోడ్డు ప్రగతినగర్‌ మూడో వీధికి  చెందిన రామిశెట్టి ఆంజనేయులు, కోటమిట్టకు చెందిన ఎస్‌కే నసీర్, ఒంగోలు పట్టణం గొడుగుపాళెంకు చెందిన ఎస్‌కే శివశంకర్, నెల్లూరు పొదలకూరురోడ్డు ఇందిరానగర్‌కు చెందిన మనోహర్‌ రాజేష్‌కుమార్‌ స్నేహితులు. చిన్నతనం నుంచే వ్యసనాలకు బానిసైన వీరు చిల్లర నేరాలకు పాల్పడేవారు. 

అయితే వీరి ఖర్చులకు అవి   చాలకపోవడంతో గొలుసు దొంగతనాలు ప్రారంభించారు. మోటారు సైకిళ్లను దొంగలించి వాటిలో తిరుగుతూ ఒంటరిగా వెళ్లే మహిళలను లక్ష్యంగా చేసుకుని గొలుసులను తెంపుకెళ్లి వాటిని అమ్మి సొమ్ముతో జల్సా చేస్తున్నారు. నిందితులు నెల్లూరు నగరంతోపాటు , బుచ్చి, ఇందుకూరుపేట, కావలి తదితర ప్రాంతాల్లో 2015 నుంచి గొలుసు దొంగతనాలకు పాల్పడుతూ పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్నారు. వీరి కదిలికలపై కొద్దిరోజులుగా సీసీఎస్, నెల్లూరు నాల్గో నగర పోలీసులు నిఘా ఉంచారు. శనివారం నిందితులు నలుగురు దొంగలించిన బైక్‌లపై వాహాబ్‌పేట పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నారన్న సమాచారం అందింది. దీంతో సీసీఎస్, నాల్గోనగర ఇన్‌స్పెక్టర్లు షేక్‌ బాజీజాన్‌సైదా, వి.సుధాకర్‌రెడ్డి తమ సిబ్బందితో కలిసి నిందితులపై దాడి చేసి అదుపులోకి తీసుకుని విచారించగా, పలు నేరాలకు పాల్పడినట్లు అంగీకరించారు. నిందితులను అరెస్ట్‌ చేసి రూ. 16 లక్షలు విలువ చేసే 70 సవర్ల బంగారు ఆభరణాలు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఆంజనేయులు, నసీర్, శివశంకర్‌ పాతనేరస్తులు.  

సిబ్బందికి అభినందన   
గొలుసు దొంగల ముఠాను అరెస్ట్‌ చేసి చోరీ సొత్తు రాబట్టేందుకు కృషి చేసిన సీసీఎస్, నాల్గో నగర ఇన్‌స్పెక్టర్లు షేక్‌ బాజీజాన్‌సైదా, వి.సుధాకర్‌రెడ్డి, నాలుగు, సీసీఎస్‌ ఎస్సైలు ఎస్‌కే అలీసాహెబ్, కె.రామకృష్ణ, సీసీఎస్‌ హెడ్‌కానిస్టేబుల్స్‌ వి.గిరిధర్‌రావు, జె. సురేష్‌బాబు, ఎస్‌.వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్స్‌ వై. సుధాకర్, జీవీ రమేష్, ఎస్‌కే గౌస్‌బాషా, ఎస్‌కే జిలాని, జి.వేణు. సీహెచ్‌ శ్రీనివాసులు, హెచ్‌ జి రామాంజనేయరెడ్డిలను  ఓఎస్‌డీ అభినందించారు. నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. త్వరలో ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ చేతుల మీదుగా రివార్డులు అందించనున్నట్లు చెప్పారు.   సీసీఎస్‌ డీఎస్పీ ఎం. బాలసుందరరావు, నగర డీఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ, సీసీఎస్, నాల్గోనగర ఇన్‌స్పెక్టర్లు షేక్‌ బాజీజాన్‌సైదా, వి. సుధాకర్‌రెడ్డి  పాల్గొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement